ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుమందు తాగి మహిళ ఆత్మ హత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలం పేరేచర్లలో జరిగింది. గ్రామానికి చెందిన నాగుల్కు.. ఫిరంగిపురం మండలం అమీనాబాదుకు చెందిన ముంతాజ్ బేగంతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. నాగుల్ లారీ డ్రైవరుగా పని చేస్తూనే.. వ్యవసాయం చేసేవాడు.
అతని ఆరోగ్యం క్షీణించిన కారణంగా.. గత 6 నెలలుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఉపాధి కరువై... ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనస్థాపం చెందిన అతని భార్య ముంతాజ్ బేగం.. ఈనెల 10న పురుగు మందు తాగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి భర్త నాగుల్ సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.