'నా పేరు గుమ్మడి భారతి. భర్త రాజారావు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేసి అనారోగ్యంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. మేము గుంటూరు శారదా కాలనీలో ఉంటున్నాం. మిర్చి యార్డు సమీపంలో 1980లో ఎకరం 23 సెంట్ల భూమిని కొనుగోలు చేశాం. 2009 వరకు పత్తి సాగు చేశాం. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి మా పొలం పక్కనే పలు ఆస్తులను సమకూర్చుకున్నారు. మా స్థలంపై ఆయన కన్ను పడింది. తనకు అమ్మమంటే మేము ఒప్పుకోలేదు. దీంతో 2009లో నా భర్తను కారుతో ఢీ కొట్టించారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పలుకుబడితో కేసు లేకుండా చేశారు. తర్వాత ఆయన పలు కట్టడాలు నిర్మించగా నా భర్త అడ్డుకొని కోర్టుకు వెళ్లారు. అక్కడ తన స్థలంలో కట్టుకుంటున్నానని, మా స్థలంలో ఏ నిర్మాణాలు చేయనని వెల్లడించారు. కారుతో ఢీకొట్టినప్పటి నుంచి నా భర్తకు వినికిడి సమస్య వచ్చింది. ఇటీవల అనారోగ్యంతో రెండేళ్లుగా మంచానికి పరిమితమయ్యారు. నా భర్త బయట కనిపించకపోవడంతో చనిపోయాడనుకొని రూ.కోట్లు విలువ చేసే మా స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ ప్రహరీ కట్టించారు. మేము వెళ్తే.. అనుచరులతో బెదిరిస్తున్నారు' అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె వివరించారు. అతని బారి నుంచి రక్షణ కల్పించి ఆక్రమణ నుంచి తమ స్థలానికి విముక్తి కలిగించాలని ఆమె కోరారు.
నేను ఎవరి భూమిని ఆక్రమించుకోలేదు: ఎమ్మెల్యే రోశయ్య
భారతి ఆరోపించినట్లు ఆ ప్రాంతంలో తనకు భూమి లేదని ఎమ్మెల్యే కిలారు రోశయ్య స్పష్టం చేశారు. తాను ఎవరి భూమినీ ఆక్రమించుకోలేదని, తన పేరు ఎందుకు చెబుతున్నారో తెలియదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: