శాసన రాజధానిగా అమరాతి కొనసాగుతుందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శ్రావణమాసంలో మంచి రోజు చూసుకుని ప్రస్తుతం అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయిస్తామని వెల్లడించారు. విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
' అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి కాలేదు. రైతులకు ఇచ్చిన ప్లాట్ల వద్ద లేఔట్ అభివృద్ధితో పాటు అక్కడ కూడా రహదారులు, ఇతర సౌకర్యాల కల్పన పనులు చేపడతాం. ప్రస్తుతం శాసనసభకు వెళ్లాలంటే ఒకే రహదారి ఉంది. ఈ ప్రాంతంలో యూనివర్సిటీలు వచ్చాయి. వాటి వద్దకు వెళ్లేందుకు తగిన రహదారులు అవసరం. అలాగే ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయిన భవనాలను నా పర్యటనలో చూశాను. ఎల్ అండ్ టీ ద్వారా చేపట్టిన పనుల వివరాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలుసుకున్నాను. ఇంకా పనులు ప్రారంభం కాని, మొదలు పెట్టి నేల స్థాయిలో ఉన్న పనుల విషయంలోనూ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాం. తెదేపా ప్రభుత్వ హయాంలో విజయవాడ నుంచి గుంటూరుకు కనీసం యాక్సిస్ రోడ్డు వేయలేకపోయారు. ఇప్పుడేమో ఉద్యమాలంటూ ప్రజల్లో అభూతకల్పనలు సృష్టించేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారు' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఇదీ చదవండి: 'అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది'