గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కుప్ప గంజి వాగు వంతెనపై ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పని ముగించుకొని తిరిగి వస్తుండగా..
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో 11వ వార్డు సభ్యుడిగా పారెళ్ల సుబ్బారావు(36) ఎన్నికయ్యాడు. బేల్దారి పనులు చేసుకునే సుబ్బారావు మరో ఇద్దరు మహిళలను ద్విచక్రవాహనంపై తీసుకొని వెళ్లాడు. సాయంత్రం పనులు పూర్తయిన తరువాత తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కింద పడిన సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మహిళలు నీలిమ, కృష్ణవేణి లను చిలకలూరిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కృష్ణవేణి పరిస్థితి విషమంగా ఉంది. ప్రధాన రహదారి పై ప్రమాదం జరగడంతో చిలకలూరి పేట -నరసరావుపేట మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చిలకలూరిపేట పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించి.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కారు ప్రమాదంలో సోదరులు మృతి .. శోకసంద్రంలో కుటుంబసభ్యులు