WAQF Lands Kabza:పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కొరకు అల్లాహ్ పేరిట పూర్వం రాజులు, నవాబులు, ధనవంతులు దానం ఇచ్చినవే వక్ఫ్ భూములు. రాష్ట్రంలో 65 వేల 783 ఎకరాల వక్ఫ్ భూములున్నాయని.. వీటిలో ఆక్రమణకు గురైన 580 ఎకరాలను వక్ఫ్‌కు పునరుద్ధరించామని.. సీఎం జగన్.. మైనార్టీ సంక్షేమ దినోత్సవాన గొప్పగా ప్రకటించారు.
ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల దీర్ఘకాలిక పరిరక్షణకు సంబంధించిన అన్ని రికార్డులను డిజిటలైజ్ చేస్తోందని.. అందులో భాగంగా 3 వేల 772 ఎకరాలకు.. గ్లోబల్ పొజిషనింగ్ సర్వేను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటనలు ఇలా ఉంటే.. గుంటూరు జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చేతలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే వక్ఫ్ భూముల్ని ఎలాగైనా సొంతవారికి ధారాదత్తం చేస్తేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
గుంటూరులో కోట్లాది రూపాయల విలువ చేసే వక్ఫ్ భూములున్నాయి. మంగళగిరి రోడ్డులోని తారకరామనగర్‌లో 2 వేల గజాల స్థలం వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది. ఈ స్థలంపై దృష్టి సారించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా.. ఆ భూమిని తన అల్లుడికి కట్టబెట్టాలనుకున్నారు. ఆ భూమిలో కల్యాణమండపం నిర్మాణం కోసం తన అల్లుడికి కేటాయించాలని వక్ఫ్ బోర్డుకు ముస్తఫా లేఖ రాశారు. ముస్లిం సంఘాల ప్రతినిధులు, మత పెద్దలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. విలువైన భూముల్ని దోచుకునే ప్రయత్నమంటూ ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు.
వక్ఫ్ భూముల వేలంపై రైతుల ఆందోళన
YCP Leaders Land Kabza: గుంటూరు లాలాపేట పెద్ద మసీదుకు చెందిన వక్ఫ్ భూములు రెడ్డిపాలెంలో ఉన్నాయి. 186.5 ఎకరాల ఈ వక్ఫ్ భూములపై అధికార పార్టీ నేతల కళ్లు పడ్డాయి. ఇప్పటికే ఇక్కడి 40 నుంచి 50 ఎకరాలు అన్యాక్రాంతం కాగా.. మిగతా భూముల్ని దోచుకునేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు శతవిధాలా పావులు కదుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందులో 10.5 ఎకరాలను ఓ వైసీపీ నాయకుడు 11 నెలల లీజుకు తీసుకున్నారని.. తర్వాత 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారంటూ వివాదాన్ని సృష్టించారని.. స్థానికులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై వక్ఫ్ బోర్డు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. ఆ భూముల్ని కౌలుకు తీసుకున్న రైతులు తెలిపారు. లాలాపేట పెద్ద మసీదుకే చెందిన 55 కోట్ల రూపాయల విలువచేసే మరో 3.49 ఎకరాల భూమిని చేజిక్కించుకునేందుకు మరో వైసీపీ నేత ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో.. ముస్లిం ప్రతినిధులు, మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు.. నరసరావుపేటలో మసీదు స్థలంలో అక్రమ నిర్మాణాలకు అధికార పార్టీ నేతలు తెరలేపడం.. తీవ్ర పరిణామాలకు దారితీసింది.
ఈ కబ్జా వ్యవహారంపై తెలుగుదేశం పార్టీకి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు షేక్ ఇబ్రహీం పోరాటం చేయగా.. ఆయన్ని పట్టపగలే దారుణంగా హత్య చేయడం సంచలనం రేపింది. గుంటూరుతోపాటు సమీపంలోనే ఉన్న ప్రత్తిపాడు మండలంలో వందల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములు ఇప్పటికీ ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నాయి. గనికపూడి, మల్లాయిపాలెంలో వక్ఫ్ ఆస్తులు ఎక్కువగా వైసీపీ నాయకులే సాగుచేసుకుంటున్నా.. కనీసం కౌలు చెల్లించడం లేదు.
కొన్ని భూములు చేతులు మారి రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. వాటిపై బ్యాంకు రుణాలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు.. వక్ఫ్ భూముల్లోనే సచివాలయం, రైతుభరోసా కేంద్రాల భవనాలను ప్రభుత్వం నిర్మించింది. ఇదంతా స్థానిక వైసీపీ నేతల ప్రమేయంతోనే జరిగిందన్న ఆరోపణలున్నాయి. వక్ఫ్ భూముల పరిరక్షణకు.. జిల్లాలో ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి, ఉన్నత స్థాయిలో సీఈవో ఉన్నా.. కాపాడలేని పరిస్థితి నెలకొంది. అందుకే వక్ఫ్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Hills And Mountains Kabja: కొండలైనా.. గుట్టలైనా కరిగిపోవాల్సిందే.. కబ్జా కోరల్లో కడప జిల్లా