Volunteers Working as YSRCP Activists: వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను (Volunteers System in AP) తీసుకువచ్చి వారికి ప్రజాధనం నుంచే వేతనాలను ఇస్తోంది. అంటే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల్లోనే వారు పాల్గొనాలి. కానీ ఆ నిబంధనలను జగన్ సర్కార్ తుంగలో తొక్కిన ఘటనలు కోకొల్లలు. సంక్షేమ పథకాల అమలు కోసం.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేశామని చెప్పే ముఖ్యమంత్రి జగన్.. వారిని పార్టీ కార్యకర్తల్లా వినియోగిస్తున్నారు.
ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగస్వాములు చేయరాదని ఈసీ హెచ్చరిస్తున్నా.. సీఎం జగన్ అవేమీ పట్టించుకోకుండా నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారు. తాజాగా తాను సీఎంగా ఉండటం ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరమో చెప్పేందుకు జగన్ కొత్తగా తీసుకొస్తున్న ‘వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమంలోనూ వాలంటీర్లనే ఇంటింటి ప్రచారానికి వినియోగించనున్నారు. వీరితో పాటు వైసీపీ నేతలు కూడా వెళ్లనున్నప్పటికీ కార్యక్రమం మొత్తాన్ని నడిపించేది వాలంటీర్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ కార్యక్రమంలో నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటి? పరిశ్రమలేమైనా తీసుకొచ్చామా? ఎంత మంది యువతకి ఉద్యోగాలు కల్పించాం? రోడ్ల పరిస్థితి.. ఇలాంటివేమీ వివరించకుండా గతంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఇళ్లకు వచ్చి చెప్పినట్టే పథకాల లబ్ధిని వివరించనున్నారు. దీనికి అదనంగా గత ప్రభుత్వంలో ఆ కుటుంబానికి అందిన లబ్ధిని పోలుస్తూ చెబుతారు. ఆ ఇంటి వారికి నచ్చితే ప్రహరీకి వైసీపీ జెండా కట్టి వెళతారు.
ఇవన్నీ చెబుతున్నపుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసిన పథకాల గురించి మాత్రం ఎందుకు చెప్పరంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిబంధనలతో పథకాల అర్హుల సంఖ్యను ఏ విధంగా కుదిస్తున్నారనేది సైతం వివరించరా అని అడుగుతున్నాయి. వాలంటీర్లకు ప్రజాధనం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల్లోనే పాల్గొనాలి. కానీ పార్టీ కార్యకర్తల్లా.. సొంత కార్యక్రమాలకు వినియోగించుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐప్యాక్ ఆధ్వర్యంలో: ‘వై ఏపీ నీడ్స్ జగన్’ను ఈ నెల 11 నుంచి వచ్చే నెల 11వ వరకు నెల రోజులపాటు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని ఎలా చేపట్టాలనే దానిపై ఐప్యాక్ (IPAC) బృందంతో నియోజకవర్గాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల శిక్షణ పూర్తి చేశారు. 175 నియోజకవర్గాల్లో జగన్‌ను గెలిపించడమంటే ప్రతీ శాసనసభ్యుడ్ని గెలిపించడమే అని ఎమ్మెల్యేల ద్వారా చెప్పిస్తున్నారు.
ఇళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు. ఇంటింటి ప్రచారం కోసం పట్టణ పరిధిలో కౌన్సిలర్, సచివాలయ కన్వీనర్, గృహసారథులు, వాలంటీర్లతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ టీమ్ ఇంటింటి పర్యటన చేయనుంది. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఆ కుటుంబానికి అందిన లబ్ధిని పోలుస్తూ వాలంటీర్లు చెప్పనున్నారు. ఆ ఇంటి వారికి నచ్చితే ప్రహారీకి వైసీపీ జెండా కూడా కట్టనున్నారు.
వాలంటీర్లతో "ఓటు" మాట.. సమావేశాలు నిర్వహించి మరీ దిశా నిర్దేశం
ప్రచారం కోసం ఇప్పటికే కిట్‌ను సిద్ధం చేశారు. ఇందులో సుమారు 100 వైసీపీ జెండాలతో పాటు ఇతర ప్రచార సామగ్రి ఉంటాయి. పథకాల లబ్ధి వివరాలతో కూడిన ఒక షీట్‌ను లబ్ధిదారుల దగ్గరకు తీసుకెళ్లి వారికి అందిన పథకాలను తెలిపి సంతకం తీసుకోనున్నారు. ఎవరికైనా పథకాలు అందకపోతే ఆ వివరాలు, వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అదే రోజు రాత్రి సచివాలయ కన్వీనర్ అక్కడి స్థానిక ప్రజాప్రతినిధి ఇంట్లో బస చేసి సమస్యల్ని వారికి నివేదిస్తారని సమాచారం.