మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటికి మరోసారి విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు వచ్చారు. విశాఖలో గంజాయి రవాణాపై మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు. అనంతరం ఆనంద్‌బాబు స్టేట్మెంట్ను నర్సీపట్నం పోలీసులు రికార్డు చేశారు. అర్ధరాత్రి విశాఖ నుంచి వచ్చిన పోలీసులు నక్కా ఆనంద్ బాబుకు నోటీసులు ఇవ్వటానికి ప్రయత్నించారు. అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇవ్వడం ఏంటి అని వాటిని తీసుకోవడానికి ఆనంద్ బాబు నిరాకరించారు. దీంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. నేటి ఉదయం నక్కా ఆనంద్ బాబు ఇంటికి పెద్ద ఎత్తున్న తెదేపా శ్రేణులు తరలివచ్చారు. పోలీసులు మాజీ మంత్రి ఇంటికి వచ్చిన సమయంలో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అన్నింట్లో ఇంత మెరుపువేగంతో స్పందిస్తే బాగుండేది..
మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటికి అర్ధరాత్రి పోలీసులు రావటంపై తెదేపా నేత చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింట్లో ఇంత మెరుపువేగంతో స్పందిస్తే బాగుండేదన్నారు. నర్సీపట్నం నుంచి గుంటూరుకు రావటం పట్ల ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే తీరిక లేని పోలీసులు... ఆనంద్ బాబుకు నోటీసులు ఇవ్వటం కోసం ఆగమేఘాలమీద వచ్చారని మండిపడ్డారు.
అసలు ఏం జరిగింది ?
విశాఖ మన్యం నుంచి గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై ఆనంద్‌బాబు సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌బాబు వైకాపా ప్రభుత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. దీంతో వసంతరాయపురంలోని ఆనంద్‌బాబు ఇంటికి వచ్చిన నర్సీపట్నం పోలీసులు.. గంజాయి రవాణాకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెబితే స్టేట్‌మెంట్ రికార్టు చేసుకుంటామని తెలిపారు. పోలీసుల నోటీసు తీసుకునేందుకు ఆనంద్‌బాబు నిరాకరించారు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు.
ఇదీ చదవండి: anand babu: గంజాయి రవాణా ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు.. నిరాకరించిన నక్కా ఆనంద్‌బాబు