Vehicles Out of Control in Guntur : గుంటూరు పెదపలకలూరు రహదారి మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు అధ్వాన పరిస్థితిలో ఉండటంతో వాహనదారులకు అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. వర్షాకాలంలో ఈ మార్గం మరింత దారుణంగా తయారైంది. వాహనాలు తరచూ ఇక్కడున్న గుంతలలో పడుతున్నాయి. తాజాగా ఓ పాఠశాల బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. మలుపు తిరిగే సమయంలో పాఠశాల బస్సు రోడ్‌పై ఉన్న బురదలో జారుతూ పక్కన ఉన్న కాలువలోకి ఒరిగింది.
డ్రైవర్ బస్సును అపటంతో బస్ కాలువ ఒడ్డునే ఆగింది. డ్రైవర్ అప్రమత్తతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్‌లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలకు ఎవ్వరికీ ఏమీ కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మార్గంలో ఇటువంటి ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉంటాయని స్థానికులు తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటంలేదని స్థానికులు వాపోతున్నారు.
మినీ లారీ వెనుక ఆర్టీసీ బస్సు.. ఎదురుగా ఆటో.. తప్పిన పెను ప్రమాదం : గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మినీ లారీ బ్రేక్ వేయడంతో ఆర్టీసీ బస్సు రెండు వాహనాలు అదుపు తప్పి రోడ్డు పక్కు దూసుకుపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర డిపో నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. గుంటూరు జిల్లా ఫిరంగీపురం మండలం నుదురుపాడు శివారు వద్దకు చేరుకోగా.. అదే సమయంలో బస్సు ముందు వెళ్తున్న మినీ లారీకి ఎదురుగా ఒక ఆటో వచ్చింది. మినీ లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో మినీ లారీ, దాని వెనుక ఉన్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లంకలోకి వెళ్లాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు వేరే బస్సులో వారి గమ్య స్థానాలకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఫిరంగిపురం పోలీసుల ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరరం వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు పక్కకు దూసుకెళ్లిన రెండు వాహనాలను జేసీబీ సహాయంతో రోడ్డు పైకి చేర్చే ప్రయత్నం చేశారు.
అదుపు తప్పిన కారు : గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలంలో భవనంవారిపాలెం పంచాయతీ పరిధి రెడ్డిపాలెం పెట్రోలు బంకు వద్ద శుక్రవారం 216 జాతీయ రహదారిపై అతి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కారు బాపట్ల నుంచి రేపల్లె వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.