రెండో డోస్ వారికి మాత్రమే ఈ నెల 31వ తేదీ వరకు వ్యాక్సిన్ వేస్తామని గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అన్నారు. ఈ లోపుగా మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన ప్రజలు దయచేసి 31వ తేదీ వరకు వ్యాక్సినేషన్ సెంటర్లకు రావొద్దని ఆమె కోరారు. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుoదని అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా రెండో టీకా వేయించుకోవాల్సిన వారి కోసం ప్రత్యేకంగా టోకెన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆమె తెలిపారు. రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన ప్రజలకు వ్యాక్సినేషన్ సెంటర్, తేదీల వివరాలను విడతల వారీగా ఇవ్వనున్నారు.
నరసరావుపేట డివిజన్లోని మండల, గ్రామాలలోని స్థానిక సచివాలయాల సిబ్బంది ప్రజలకు ప్రత్యేకంగా టోకెన్లు అందజేస్తారని సబ్ కలెక్టర్ సూచించారు. మొదటి డోస్ వ్యాక్సిన్ చేయించుకున్న వారి వివరాలను ఇప్పటికే ఆయా ప్రాంతాల తహసీల్ధార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు పంపామన్నారు. టోకెన్లు అందిన ప్రజలు వ్యాక్సిన్ వచ్చిన తేదీని బట్టి ప్రకటించిన తేదీలలో ఆయా వ్యాక్సినేషన్ సెంటర్లకు ఉదయం 7 గంటల కల్లా వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుని సహకరించాలని కోరారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ సమయంలో అధికారులు ఆయా ప్రాంగణాలలో ఏర్పాటు చేసిన విధంగా క్యూ లైన్లలో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: యాంటీజెన్ టెస్ట్, ఆర్టీ- పీసీఆర్‌కు తేడా ఇదే..