Remove YSR statue in Jonnalagadda: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ - రంగారెడ్డిపాలెం మార్గంలో ఉన్న దివంగత నేత, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియను దుండగులు తొలగించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైకాపా నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే, వైకాపా శ్రేణులు.. స్థానికంగా ఉన్న గుంటూరు - కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ నిలిపోయింది.
నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ధర్నా విరమించాలని వైకాపా శ్రేణులను కోరారు. తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేసే వరకూ ధర్నా విరమించేది లేదంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు నినాదాలు చేశారు. డీఎస్పీ నచ్చజెప్పడంతో వైకాపా శ్రేణులు ధర్నా విరమించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే గోపిరెడ్డి
జొన్నలగడ్డ సొసైటీ బిల్డింగ్ వద్ద కొంతకాలంగా ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు అదృశ్యం చేయడం దారుణమని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక సచివాలయం వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో విగ్రహాన్ని గుర్తించి తీసుకురాకపోతే.. మేమే 7 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తామన్నారు.
ఇదీ చదవండి..
Ambati Dance: సంక్రాంతి వేడుకల్లో స్టెప్పులేసిన ఎమ్మెల్యే అంబటి