Unilateral Attitude of Police in the State: ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబాల్లోని మహిళలపై బూతులతో విరుచుకుపడుతూ సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర, అశ్లీల, మార్ఫింగ్‌తో కూడిన నీచమైన పోస్టులు పెట్టే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఒక్కటంటే ఒక్క కేసూ నమోదు చేయరు. అదే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించినా వైసీపీ నాయకుల్ని విమర్శిస్తూ, తప్పిదాల్ని ఎత్తిచూపుతూ చిన్న పోస్టు పెట్టినా సరే వెంటాడి వేటాడుతారు. వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా.. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా పట్టించుకోకుండా వారేదో ఉగ్రవాదులు, దేశద్రోహులు అన్నట్లుగా అరెస్టు చేస్తున్నారు. విచారణ పేరిట వేధిస్తున్నారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
సీఎం జగన్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారంటూ గుంటూరుకు చెందిన పిడికిటి శివపార్వతి, కృష్ణాజిల్లా పోరంకికి చెందిన వెంకట ఆది వరప్రసాద్‌ను వేర్వేరు పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో బుధవారం అరెస్టుచేశారు. శివపార్వతి తండ్రి ఇటీవలే మరణించారు. అక్టోబరు 2న ఆయన పెద్దకర్మ చేయాలి. ఆ మాట చెబుతున్నా వినకుండా అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండును తిరస్కరించి పోలీసుల తీరును తప్పుబట్టారు. ఇవేకాదు గతంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధిస్తూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ పోస్టును ఫార్వర్డ్ చేశారన్న అభియోగంతో గుంటూరుకు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు పూదోట రంగనాయకిపై సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి విచారించారు.
Police Fight In Bihar Nalanda : లంచం వాటాల్లో తేడాలు.. నడిరోడ్డుపైనే కొట్టుకున్న పోలీసులు!
మాజీమంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేపై వాట్సప్‌లో వచ్చిన ఓ పోస్టు ఫార్వర్డ్ చేశారన్న కారణంతో తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు, 70 ఏళ్ల వృద్ధుడైన నలంద కిషోర్‌ను కొన్నాళ్ల కిందట పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం నుంచి పోలీసు వాహనంలో కర్నూలుకు తరలించి వేధించారు. కొన్నాళ్లకే ఆయన మానసిక వేదనతో చనిపోయారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ జె.సాంబశివరావు అనే వ్యక్తిని మంగళగిరి పోలీసులు గతంలో అరెస్టు చేశారు. సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ ప్రకారం నోటీసు ఎందుకివ్వలేదని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కోర్టుధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించి..తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. వాట్సప్‌లో వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేశారంటూ 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబును అరెస్టు చేయగా.. 41ఏ నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని న్యాయస్థానం సీఐడీ అధికారులను ప్రశ్నించి, షోకాజ్ నోటీసు జారీచేసింది.
Anganwadis Chalo Vijayawada: అంగన్వాడీల ఛలో విజయవాడపై.. పోలీసుల ఉక్కుపాదం..!
ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులపై అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెట్టే వైసీపీ వారిపై కేసులు పెట్టడం కాదు కదా వారిపై అందే ఫిర్యాదులు కూడా పట్టించుకోవట్లేదు. తనను కించపరస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం అర్బన్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పోలీసులకు ఫిర్యాదు చేసి ఏళ్లు గడుస్తున్నా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళా రైతులపై అసభ్యపోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపై ఫిర్యాదుచేసి మూడేళ్లవుతున్నా ఊసే లేదు. తెలుగుమహిళ నేతలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధను ఉద్దేశించి వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వాటిపైనా పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేవు. తెలుగుదేసం నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పైన, ఆయన కుటుంబసభ్యులపైన సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, చంపేస్తామని హెచ్చరించే పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదుచేస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు.
TDP Leaders Protest in Visakhapatnam: విశాఖలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ
రాష్ట్రంలో గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికి, అధికార పార్టీ నాయకులకే ఉంటాయన్నట్లు మిగతావారికి ఇవేవీ ఉండవన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అధికార వైసీపీ నాయకులు ఎంతటి నీచమైన పోస్టులు పెట్టినా తప్పు కాదని.. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిన్న పోస్టు పెట్టినా సరే అది మహానేరమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులివ్వకుండా ఎలా అరెస్టుచేస్తారని న్యాయస్థానాలు పదే పదే ఆక్షేపిస్తున్నా.. పోలీసులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. రిమాండు ఇవ్వడానికి న్యాయస్థానాలు నిరాకరిస్తున్నా లెక్కచేయట్లేదు. హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించినవారిపై చర్యలు తీసుకోవటంలో ఉత్సాహం చూపని పోలీసులు.. ముఖ్యమంత్రిని దూషించారనే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అరెస్టులు చేస్తున్నారు. గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు.. ప్రతి ఒక్కరికీ ఉంటాయని.. అందరి గౌరవాన్నీ కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని హైకోర్టు గతంలో పోలీసుల తీరును ఎండగట్టింది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదని తేల్చిచెప్పినా పోలీసుల తీరు మాత్రం మారట్లేదు.