TDP Samara Sankharavam Sabha in Bengaluru: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ బెంగళూరు టీడీపీ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమర శంఖారావం సభకు ఏపీకి చెందిన టీడీపీ నేతలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు చంద్రబాబు విలువ తెలిసిందని టీడీపీ నాయకులు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన బలం, బలగం వైసీపీ నాయకులకు తెలిసిందన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బెంగళూరులోని మార్తనహళ్లి ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ నిర్వహించి బాబుకు మద్దతు తెలిపారు.
విజనరీ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకోవడానికి సమర శంఖరావం పూరించామన్నారు. జగన్ సీఎం అయ్యాక కక్ష రాజకీయాలకు పాల్పడటంతో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విలువ తెలిసిందని ఏపీ పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు చరిత్రలో మిగిలిపోతే... చంద్రబాబునాయుడు అందరి జీవితాలలో నిలిచారని గుర్తు చేసుకున్నారు. చట్టంలో లొసుగులను ఆధారం చేసుకొని అధినేతను జైలులో పెట్టారని టీడీపీ నాయకులు ఆరోపించారు. తమకున్న అవినీతి మరకను చంద్రబాబుకు అంటించడానికి జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతటి నీచమైన పాలన ఎప్పుడు చూడలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గతంలో మాదిరిగా పాదయాత్ర చేస్తే మహిళలు తరిమికొడతారన్నారు. భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబుకు అన్యాయం జరిగిందన్న కసి ఐటీ ఉద్యోగులలో ఉందన్నారు. మద్యపాన నిషేధం హామీ ఇచ్చి 8 వేల కోట్ల రూపాయల రుణం తెచ్చిన ఘనత జగన్ కు దక్కిందన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం వ్యవస్థలన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. విశాఖలో 45 వేల కోట్ల రూపాయల భూములు కొట్టేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.
IT Employees Protest in Chennai చెన్నైలో ఐటీ ఉద్యోగుల నిరసనలు.. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ ఆందోళనలు
టీడీపీ నేతలపై వెసీపీ నాయకులు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రజానేత చంద్రబాబు జైలుకెళితే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుందన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి గ్రామానికి ఐటీ ఉద్యోగులు పదిరోజుల రావాలని పిలుపునిచ్చారు. బెంగళూరు టీడీపీ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమర శంఖారావం సభకు ఏపీకి చెందిన టీడీపీ మాజీ మంత్రులు పాల్గొన్నారు. బహిరంగ సభకు ముందు తెలుగు ప్రజలు, ఐటీ ఉద్యోగులు బెంగళూరు నగరంలోని మార్తనహళ్లి ప్రాంతంలో కార్ల ర్యాలీ నిర్వహించి.. బాబుతో మేమంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. సభ ప్రారంభం కావడానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‍లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్ధితులను కళ్ళకు కట్టేలా ఆటపాటలు ప్రదర్శించారు.