Jal Jeevan Mission Frauds in AP : నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కొందరు అధికారుల్లో మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. వైఎస్సార్సీపీ నేతలకు జై కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. జలజీవన్ మిషన్‌లో కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పనులను కొనసాగించడమే దీనికి నిదర్శనం. గుత్తేదారులు పైపులు గతంలోనే కొన్నారని పాత తేదీలతో రికార్డులు సృష్టించి మరీ పనులను ప్రారంభించేలా చేస్తున్నారు.
జలజీవన్ మిషన్ పథకాన్ని పునర్‌వ్యవస్థీకరించి గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇంజినీర్లు కొందరు గండికొడుతున్నారు. సర్కార్ రద్దు చేసిన వాటి నుంచి 15,000లకు పైగా పనులను తిరిగి కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. వీటి అంచనా విలువ రూ.6000ల కోట్ల వరకు ఉంటుంది. గుత్తేదారులతో ఇంజినీర్లు కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిస్తున్నారు.
AP Govt Focus on Jal Jeevan Mission : వైఎస్సార్సీపీ సర్కార్ భ్రష్టు పట్టించిన జలజీవన్ మిషన్ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వేసవిలో అడుగంటిపోయే బోర్ల నుంచి కాకుండా జలాశయాలు, నదుల నుంచి ప్రజలకు నీరందించేలా సమగ్ర ప్రాజెక్టుకు నివేదికలు సిద్ధం చేయించింది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో ప్రారంభించని దాదాపు 40,000ల పనులను రద్దు చేసింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన పనుల రద్దు, కొనసాగింపు విషయంలో కూటమి సర్కార్ కొన్ని షరతులు విధించింది. ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేయాలని, 25 శాతానికిపైగా పనులు పూర్తయితే కొనసాగించాలని గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీరింగ్ విభాగానికి సూచించింది. 25 శాతం లోపు పనులు జరిగి పైపులు కొన్నట్లైతే గుత్తేదారులు నష్టపోకుండా అలాంటి వాటిని కూడా కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గుత్తేదారులు అవకాశంగా తీసుకుంటున్నారు.
దీనికి ఇంజినీర్లూ సహకరించడంతో రద్దయిన పనుల్లో 6000ల వరకు తిరిగి కొనసాగించేలా పావులు కదుపుతున్నారు. గుత్తేదారులు పనులు ప్రారంభించకపోయినా చేసినట్లుగా, పైపులు కొనుగోలు చేయకపోయినా చేసినట్లుగా ఇంజినీర్లు నివేదికలు తయారు చేస్తున్నారు. పైపులు కొన్నట్లుగా గుత్తేదారులు తెస్తున్న తప్పుడు బిల్లులను చూపిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇలాంటి అడ్డగోలు పనులతో జాబితాలు రూపొందిస్తున్నారు. ఈ వ్యవహారంలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఈఎన్‌సీ కార్యాలయంలో కొందరు ఇంజినీర్లు చక్రం తిప్పుతున్నారు.
టెండర్లు మరోసారి పిలవకుండా అడ్డుకునే ప్రయత్నం : ప్రభుత్వం రద్దు చేసిన పనులను మళ్లీ మొదలు పెట్టాలంటే నిబంధనల ప్రకారం ఇంజినీర్లు మరోసారి టెండర్లు పిలవాలి. వైఎస్సార్సీపీ సర్కార్లో పనులు దక్కించుకున్న పలువురు గుత్తేదారులు వీటిని పలు కారణాలతో ప్రారంభించలేదు. మళ్లీ టెండర్లు పిలిస్తే వారికే దక్కుతాయన్న హామీ లేదు. చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో వాటిని తిరిగి కొనసాగించేందుకు కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేల ద్వారా గుత్తేదారులు ఇంజినీర్లకు సిఫార్సు చేయించుకుంటున్నారు.
దీంతో ఇంజినీర్ల సూచనలపై తాగునీటి సరఫరా పనులకు పైపులు కొన్నట్లుగా గుత్తేదారులు పాత తేదీలతో బిల్లులు తెచ్చుకుంటున్నారు. పనులు ఇదివరకే ప్రారంభమైనట్లుగా ఇంజినీర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. గతంలో ఈ పనులు గుత్తేదారుల ముసుగులో చాలామంది వైఎస్సార్సీపీ జిల్లా, మండల స్థాయి నేతలు దక్కించుకున్నారు. సర్కార్ మారినా వీరి హవా ఇప్పటికీ గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీరింగ్ విభాగంలో కొనసాగుతోంది. వీరు చెప్పిందే వేదమన్నట్లుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్లు వ్యవహరిస్తున్నారు.