TDP Protests about Chandrababu Health Condition: చంద్రబాబు ఆరోగ్యంపై తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశాయి. చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ చెలగాటం ఆడుతున్నారని.. మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. మైలవరం దీక్షా శిబిరంలో నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని తాడేపల్లి ప్యాలెస్ నియంత్రిస్తోందని నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. జైల్లో వాస్తవాలని.. సజ్జల సమాధి చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకి సంఘీభావంగా బాపట్ల జిల్లాలో మక్కెనవారిపాలెం నుంచి పరిటాలవారి పాలెం వరకు గొట్టిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర చేపట్టారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని గుంటూరు, తెనాలిలో ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేశారు. చంద్రబాబుకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధినేత ఆరోగ్యంపై ప్రతి గంటకూ ప్రత్యేక హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని.. ప్రకాశం జిల్లా కనిగిరి స్థానిక ఎస్సైకి టీడీపీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. సింగరాయకొండలో నిరసన ప్రదర్శన చేశారు.
చంద్రబాబుకు జైళ్లో సరైన సౌకర్యాలు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. కర్నూలులో ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని ఎమ్మిగనూరు ఆంజనేయస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రార్థనలు నిర్వహించారు. నంద్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. వైసీపీ అరాచక పాలనను వ్యతిరేకిస్తూ.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆధ్వర్యంలో తిమ్మాపురానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.
చంద్రబాబుని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. రైల్వేకోడూరులో టీడీపీ అభిమానులు భారీ ర్యాలీగా వెళ్లి.. టోల్గేట్ వద్ద మానవహారం నిర్వహించారు. సీఎం జగన్ అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ.. కడప ఎన్టీఆర్ కూడలిలో టీడీపీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చంద్రబాబు లాయర్లను అనుమతించినట్లే.. ఆయన తరఫు వైద్యుల్ని జైళ్లోకి ఎందుకు అనుమతించడం లేదని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రశ్నించారు.
Chandrababu Illness In Jail: ఎండవేడిమి, ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ.. వైద్య పరీక్షలు
చంద్రబాబు ఆరోగ్యం పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. శ్రీకాకుళంలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. అధినేతను హతమార్చాలనే కుట్ర జరుగుతోందని.. టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడి.. చంద్రబాబుకి మెరుగైన వైద్యం అందించాలని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి డిమాండ్ చేశారు.
రాజమండ్రి జైళ్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు, విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా చీపురుపల్లిలో టీడీపీ నేతలు, రైతు సంఘం నాయకులు నిరసన ర్యాలీ చేశారు. రాజమహేంద్రవరం టీడీపీ క్యాంపు కార్యాలయంలో నారా భువనేశ్వరిని కలిసి మాజీ మంత్రి పీతల సుజాత సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టం జనగామ జిల్లా నుంచి సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ అభిమానులు రాజమహేంద్రవరం చేరుకుని నారా భువనేశ్వరిని కలిసి మద్దతు తెలిపారు.
Chandrababu's Health in Jail : జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆ పార్టీ నేతలు రోడ్లు శుభ్రం చేశారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధిచెబుతారని ఏలూరు పాత బస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుని వివరిస్తూ తూర్పుగోదావరి జిల్లా వెంకటపాలెంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ తప్పుడు కేసులను వ్యతిరేకిస్తూ అల్లూరి జిల్లా పాడేరులో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు.
ప్రభుత్వం సరైన వైద్య సేవలు అందించాలని.. విశాఖ జిల్లా భీమునిపట్నం టీడీపీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తూ బెంగళూరులో చేనేత సంఘం నేతలు అమ్మవారికి చీరను సమర్పించి.. 101 టెంకాయలు కొట్టారు. కక్షపూరిత రాజకీయాలకు జగన్ ప్రభుత్వం ఇకనైనా స్వస్తి పలకాలని.. లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.