TDP MLA Anagani Satyaprasad Comments on Kapus: వైఎస్సార్సీపీ మూడున్నరేళ్ల పాలనలో కాపులకు జరిగిన అన్యాయం, అవమానం.. గత ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్ కాపుల్ని ఆర్థికంగా, రాజకీయంగా అణిచి వేసి కాపుల కళ్లు పొడిచారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చీ రాగానే కాపుల అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ను ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన రిజర్వేషన్‌ను ఎత్తేసి కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ అబద్ధాలు చెబుతూ.. కాపు సామాజిక వర్గం మొత్తాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా 3 వేల 100 కోట్ల నిధులు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేశామన్న అనగాని.., జగన్ కాపు కార్పొరేషన్ రుణాలకు చేసుకున్న దరఖాస్తులను కూడా రద్దు చేశారని దుయ్యబట్టారు. కాపులకు శాశ్వత ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో ఎన్నికల హామీల్లో భాగంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా 4,528 మంది కాపు విద్యార్థులకు లబ్ధి, ఎన్టీఆర్ ఉన్నత విద్యా పథకం ద్వారా 28.26 కోట్లతో 1,413 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చిన్నట్లు గుర్తు చేశారు.
ఉప ముఖ్యమంత్రి పదవిని కాపు నాయకునికి టీడీపీ ఇచ్చిందని, కానీ జగన్ కాపు నేతల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో కాపు భవన్‌ల నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కేటాయించామని, కానీ జగన్ కాపు భవన్లను నిర్వీర్యం చేసి ఆయన మాత్రం ఊరికొక ప్యాలెస్ కట్టుకుంటున్నారని అన్నారు. కాపులను అన్ని విధాలా అణగదొక్కుతున్న జగన్‌కి బుద్ధి చెప్పేందుకు కాపులు సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: