TDP Leaders Protest on Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతల ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో తెలుగుదేశం శ్రేణుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలో కనకదుర్గమ్మకు సారె సమర్పించాలని ఉమ్మడి కృష్ణ జిల్లా టీడీపీ నేతలు నిర్ణయించారు. కొండ కింద ఉన్న వినాయకుడి గుడి దగ్గర నుంచి దుర్గ గుడి వరకు పాదయాత్రగా వెళ్లి అమ్మవారికి సారె సమర్పించాలని కార్యక్రమాన్ని నిర్ణయించారు. అమ్మవారికి సారె కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు.
దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ప్రశ్నిస్తూ.. రాష్ట్రంలో దేవాలయాలకు వెళ్ళడానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలా అని మండిపడ్డారు. రాష్ట్రంలో దైవ దర్శనానికి వెళ్లాలన్న పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి.. వైసీపీ పాలన వల్ల ఏర్పడిందని మండిపడ్డారు. జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని ఆయన ధ్వజమెత్తారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా.. లేదా రాజారెడ్డి రాజ్యాంగమా అని నిలదీశారు. అమ్మవారి గుడికి వెళ్తున్న కొల్లు రవీంద్రను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఎటువంటి నోటీసులు అందించకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఏ హక్కుతో తనను అడ్డుకుంటున్నారని పోలీసులతో కొల్లు రవీంద్ర వాదనకు దిగారు. తనను అడ్డుకోవటంపై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ రద్దు కావాలని అందుకు కనకదుర్గమ్మ ఆశీస్సులు కోరుతూ.. మొక్కులు చెల్లించటానికి వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉయ్యూరు వైపు నుంచి వచ్చిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌లను.. విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద అరెస్ట్ చేసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్కి తరలించారు.
చంద్రబాబుపై హైకోర్టులో మంగళవారం పలు అక్రమ కేసుల విచారణ నేపథ్యంలో కనకదుర్గమ్మను దర్శించుకుని.. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమానికి బయల్దేరామని టీడీపీ నేతలు వివరించారు. ఈ సమయంలో తమను అదుపులోకి తీసుకోవడం అన్యాయమని రాజేంద్రప్రసాద్ అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తే అంత ఉలిక్కిపాటు ఎందుకు అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి బండారు అరెస్ట్: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విశాఖ సింహాచలం అప్పన్న స్వామిని దర్శనం చేసుకోవటానికి వెళ్లిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డంగి ఈశ్వరిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టు సమయంలో పోలీసులు భారీగా మోహరించి అదుపులోకి. తమ నాయకుడు త్వరగా విడుదల కావాలని కోరుకోవటానికి ఆలయానికి వెళ్తుండగా.. పోలీసులు అరెస్టు చేశారని టీడీపీ నేతలు వాపోయారు.
చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు: చంద్రబాబు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని.. విఘ్నలు తొలగిపోవాలని కోరుతూ బాపట్ల జిల్లా చినగంజాం మండలం గొనసపూడిలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామంలోని ఆంజనేయస్వామికి పూజలు చేసి.. గ్రామస్తులు వినాయక మండపంలో చంద్రబాబు, కుటుంబ సభ్యుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ ప్లకార్డులు చేతపట్టుకని నినాదాలు చేశారు. చంద్రబాబుపై వేసిన నిలాపనిందలు పోయి.. జైలు నుండి కడిగినముత్యంలా బయటకు వస్తారని గ్రామస్తులు అన్నారు.
సింహచలం అప్పన్న ఆలయానికి వెళ్తున్న టీడీపీ నేతల హౌస్ అరెస్టులు: చంద్రబాబు ఆరోగ్యంపై సింహాచలంలో మెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడానికి వెళ్తున్న.. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పెందుర్తులోని ఆయన ఇంట్లోనే పోలీసులు గృహ నిర్బంధం చేయగా.. ప్రతిపక్షాలను అణగదొక్కేలా సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
మరోవైపు విశాఖ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పిలుపు మేరకు.. సింహచలం ప్రత్యేక పూజల కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లెందుకు సిద్ధమైన టీడీపీ నేతలను, శ్రేణులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ స్పందిస్తూ.. పోలీసుల చర్యలు అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.