అమరావతి రాజధాని ప్రాంత రైతుల రహదారి నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రైతులకు తెదేపా నేతలు మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు గృహనిర్బంధం కొనసాగుతోంది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. విజయవాడలో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందును గృహ నిర్బంధం చేశారు. చినకాకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్ బొస్కో స్కూల్ వద్ద పోలీసుల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి స్థానికులను గ్రామాల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. మంగళగిరి పట్టణంలో 40 మంది తెదేపా ముఖ్యనాయకులు, మంగళగిరి జె ఏ సి నాయకులు హౌస్ అరెస్ట్ చేసి కొందరిని స్టేషన్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పలువురు తెదేపా కార్యకర్తలు, నేతలను తాడేపల్లి పీఎస్ కు తరలించి నట్లు సమాచారం. సీపీఐ నేత ముప్పాల నాగేశ్వరరావును ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళగిరి జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్ గృహనిర్బంధం చేశారు. ప్రభుత్వం రైతు పోరాటానికి భయపడే అక్రమ అరెస్టులు చేస్తుందని నేతలు మండిపడ్డారు.
ఇదీ చదవండి: నేడు రహదారిపైకి రాజధాని పోరు !