Chalo Anumarlapudi: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై నిరసన చేపట్టేందుకు.. తెదేపా నేతలు నేడు చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆంక్షలు విధించి.. తెదేపా నేతలను గృహనిర్బంధించారు. గుంటూరులోని నివాసంలో నక్కా ఆనంద్‌బాబు గృహనిర్బంధించిన పోలీసులు.. అనుమర్లపూడి వెళ్లొద్దని హెచ్చరించారు. గుంటూరు రింగ్‌రోడ్డులోని ఆలపాటి రాజా ఇంటి వద్ద పోలీసుల మోహరించగా.. మంగళగిరిలో గంజి చిరంజీవిని గృహనిర్బంధించారు.
అనుమర్లపూడి చెరువు వద్ద ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్టు చేయగా.. వారికి తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ధూళిపాళ్లతో సహా ఇతర నాయకులను అరెస్టు చేసి తెనాలి తరలించారు.
ఆంక్షలు దాటుకుని అనుమర్లపూడి చెరువు వద్దకు చేరుకున్న తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరిపై నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ సహా ఎవరి అనుమతులతో చెరువును తవ్వుతున్నారని.. వైకాపా అరాచకాలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి తెదేపా నేతలు అనుమర్లపూడి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.
అక్రమ మైనింగ్ నిలుపుదల చేసే వరకు పోరాటం ఆగబోదని.. ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు. చలో అనుమర్లపూడి పిలుపులో భాగంగా చెరువు వద్దకు చేరుకున్న ఆయన్ని పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకుని.. తెనాలి పోలీస్ స్టేషన్లో బైండోవర్ అనంతరం చింతలపూడిలో ఆయన నివాసం వద్ద వదిలిపెట్టారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జగనన్న లేఅవుట్ లకు మెరక పేరుతో ఒక్కో ట్రక్కును 8వందల నుంచి 1200 వరకు అమ్ముకుంటూ స్థానిక ఎమ్మెల్యే వారి కార్యకర్తలు కోట్ల రూపాయలు దండుకున్నారని నరేంద్ర ఆరోపించారు. ప్రభుత్వ అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్న ధూళిపాళ్ల.. అన్నింటిపై పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఈనెల 13న అనుమర్లపూడి వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను వైకాపా నేతలు అడ్డుకుని.. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ధూళిపాళ్ల సహా పార్టీ నేతలు చలో అనుమర్లపూడిని సవాల్‌గా తీసుకున్నారు.
ఇవీ చూడండి: