Junabai Tigress in Tadoba tiger reserve : తడోబా-అంధేరి టైగర్ రిజర్వును ఓ ఆడ పులి ఏకఛత్రాధిపత్యంగా ఏలుతోంది. దాని పేరు జూనాబాయి. వయసు తొమ్మిదేళ్లు. ఇప్పటికే ఆ ఆడపులి.. అయిదు విడతల్లో ఏకంగా 17 కూనలకు జన్మనిచ్చింది. తాజాగా రెండు కూనలతో సందడి చేస్తున్న సుందర దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. తల్లి ప్రేమను పంచడంతో పాటు ఆత్మరక్షణ చేసుకోవడం, వేటాడటం లాంటి అంశాల్ని కూనలకు నేర్పిస్తోంది. ఈ అరుదైన దృశ్యాలను మహారాష్ట్రకు చెందిన రిటైర్డ్ సివిల్ సర్జన్ డాక్టర్ రాజేంద్రకుమార్ జైన్ తన కెమెరాలో బంధించారు.
బఫర్ ఏరియాలోనే స్థిరనివాసం: సాధారణంగా రక్షణ దృష్ట్యా పెద్దపులులు అడవి మధ్య కోర్ ఏరియాలో ఉంటాయి. జూనాబాయి మాత్రం కోలార్-మద్నాపూర్ బఫర్ ఏరియాలోనే స్థిరనివాసం ఏర్పర్చుకుంది. బఫర్‌లో సాధారణంగా మనుషులు, పశువుల సంచారంతో ఇబ్బందులు, వేటగాళ్ల ముప్పు ఉంటాయి. కానీ ఈ పులి మాత్రం అక్కడే స్థిరపడింది. దాని పిల్లలు మాత్రం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆవాసం ఏర్పర్చుకుంటున్నాయి.
జూనాబాయి తొలి విడత 2017లో మూడు, 2018లో నాలుగు, 2020లో మూడు, 2021లో నాలుగు, 2022లో మూడు కూనలకు జన్మనిచ్చింది. తన కూనల్ని చంపేందుకు మగ పులులు పలుమార్లు ప్రయత్నించగా వాటి బారినుంచి కాపాడుకుంది. తన సంతతిని భారీగా పెంచుకుంటోంది. తడోబా-అంధేరి టైగర్ రిజర్వు మహారాష్ట్రలో ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తిరిగే.. పలు పులులు తడోబా నుంచి వచ్చినవే. అక్కడ పులుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆవాసం సరిపోక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి.
ఇవీ చదవండి: