Statewide Protests Against Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుని వ్యతిరేకిస్తూ.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలతో నిరసన తెలిపారు. పామర్రు మండలం జేమిగోల్వేపల్లిలో బాబు జగజ్జీవన్ రామ్‌కి నివాళులర్పించి మహిళా కార్యకర్తలు.. కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. జైలులో చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ.. చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామస్థులు ఆరుబయటే నిద్రించారు.
చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని.. పమిడిముక్కల మండలం పెనుమత్సలో శ్రీ అభయ ఆంజనేయస్వామికి ఆ పార్టీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో మహిళలు, నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పార్టీ అధినేత జైలు నుంచి త్వరగా విడుదల అవ్వాలని.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం బాలయేసు చర్చిలో టీడీపీ నేత తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. మంగళగిరిలో టీడీపీ మహిళలు.. వైసీపీ ప్రభుత్వ దమనకాండను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ.. వారిని నెట్టుకుంటూ మహిళలు ర్యాలీని కొనసాగించారు. గుంటూరులోని ప్రధాన కూడళ్లలో మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో.. చంద్రబాబు అక్రమ అరెస్టుని ప్రజలకు తెలిసేలా కరపత్రాలు పంపిణీ చేశారు.బాపట్ల జిల్లాలో టీడీపీ శ్రేణులు.. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ర్యాలీలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని.. పెదకూరపాడులో మహిళలు కదం తొక్కారు.
రాష్ట్రంలో కురుక్షేత్ర సంగ్రామం మొదలైందని.. కౌరవ వధ జరగాల్సిందేనని చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ.. ప్రకాశం జిల్లా శంకరాపురంలో తెదేపా శ్రేణులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ.. కనిగిరిలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే.. వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
TDP Leaders Performed Pujas for Chandrababu: ఏపీలో కొనసాగుతున్న ఆందోళనలు, పూజలు.. నిరసనలు
మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. కావలిలో టీడీపీ నేతలు చేస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించారు. జైలుకు వెళ్లి వచ్చిన జగన్ రెడ్డికి.. అందరూ దొంగల్లా కనిపిస్తున్నారని.. కక్షపూరిత ధోరణితో కేసులు పెట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. అనంతరం టీడీపీ, జనసేన నాయకులు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదులు చేస్తూ.. కాగడాల ప్రదర్శనల చేశారు. చంద్రబాబుకి పెరుగుతున్న మద్దతుని చూసి ఓర్వలేక.. వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని రాయలసీమ వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసనలతో హోరెత్తించారు.
కర్నూలు జిల్లా ఆలూరులో ఆ పార్టీ నేతలు సామూహిక దీక్షలు చేశారు. చంద్రబాబు అరెస్టుని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని బనగానపల్లెలో న్యాయవాదులు నిరసన తెలిపారు. చంద్రబాబుని విడుదల చేసే వరకు పోరాటం ఆగదని.. మంత్రాలయంలో మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం జగన్ రెడ్డి కక్షపూరిత ధోరణికి నిరసనగా.. నంద్యాలలో టీడీపీ నేతలు కాగడాల ప్రదర్శన చేశారు. అధినేత అక్రమ అరెస్టుని వ్యతిరేకిస్తూ.. తిరుపతి జిల్లా బాలాయపల్లి, పుత్తూరులో పార్టీ కార్యకర్తలు దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు.
సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీ శ్రేణులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు విడుదల కావాలని.. శింగనమల, రైల్వేకోడూరులో టీడీపీ శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కడపలోని మరియాపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు, కొవ్వొత్తులతో నిరసనలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని బీబీసీ చర్చిలో టీడీపీ క్రిస్టియన్ మైనార్టీ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు.
కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలో టీడీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. కసింకోట మండలం చింతలపాలెంలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేశారు. చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ.. విశాఖలో సీపీఐ పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపక్షపార్టీలు పాల్గొన్నాయి.
ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని అఖిలపక్ష నేతలు ఖండించారు. పెందూర్తిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కాగాడాల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుని ఖండిస్తూ.. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం అల్లిన గ్రామంలో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేశారు. చంద్రబాబుకి మద్దతుగా విజయనగరం జిల్లా చీపురపల్లి, బొబ్బిలిలో టీడీపీ నేతలు నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.