NOTICES TO AP EMPLOYEES UNION: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని... సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నోటీసులపై వారం లోగా సమాధానం ఇస్తామన్న ఉద్యోగుల సంఘం నేతలు...నిబంధనల ప్రకారం అయితే అన్ని సంఘాల మీద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఉద్యోగులకు సకాలంలో జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు చెప్పాలని ఆదేశించింది.
ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు త్వరలోనే సమాధానం ఇస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. రాష్ట్రగవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రం గురించి ప్రసార మాధ్యమాల్లో వివరించడంపై రాష్ట్ర ప్రభుత్వం సంజాయిషీ కోరిందన్నారు. వేతనాలు ఆర్ధిక ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించలేదనటానికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. రోసా నిబంధనలు ప్రయోగిస్తే.. ఉద్యోగ సంఘాలన్నింటిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ఆస్కారరావు అన్నారు.
వేతన సమస్యలు తెలిపేందుకు గవర్నర్ అంతిమ వేదిక అని భావించి విజ్ఞప్తి చేశామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు వివరణ ఇచ్చారు.తమ సంజాయిషీ తర్వాత ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"మేము సంప్రదించకుండా వెళ్లాము.. దానిని బహిరంగ పరిచాము అని నోటీసు ఇచ్చారు. నిబంధనల ప్రకారం మేము వివరణ ఇస్తాం. లీగల్‌గా కూడా వెళ్తాం. మేము ప్రెస్‌కు వెళ్లడం తప్పు అయితే.. రాష్ట్రంలో ఉన్న గుర్తింపు పొందిన అన్ని ఉద్యోగ సంఘాలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి". - సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
"1962లో ఈ రోసా రూల్స్ పుట్టబడ్డాయి. అంటే రాజకీయ పార్టీల సహాయం కోరరాదు. రాజకీయ నాయకులను మీటింగులకు పిలవరాదు. పత్రికలలో స్టేట్మెంట్లు ఇవ్వరాదు. ఇలా కొన్ని నిబంధనలు పెట్టారు. మళ్లీ వాటిని సవరించారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవలసిన సంఘం కాబట్టి.. ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు వారం రోజులు గడువు ఉంది. కానీ ఈ నోటీసులివ్వటం విచిత్రంగా ఉంది". - ఆస్కారరావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత
ఇవీ చదవండి: