Contractual and Outsourcing Employees Problems: తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. గుంటూరులో సమావేశమైన ఆ సంఘం ఐకాస నేతలు.. మరోసారి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 78ను రద్దు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాన్ని 26 వేలకు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 28వేల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆప్కాస్‌లో పనిచేస్తున్న అన్నిశాఖల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, చేయూత, తెల్లరేషన్ కార్డు, ఇంటిపట్టా వంటివి తమకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో ఛలో విజయనగరానికి వారు పిలుపునిచ్చారు.
"సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని హామీని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు అవుతోంది. కానీ కాంట్రాక్టు ఉద్యోగులను పక్కన పెట్టారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఏ మంత్రిని కలిసినా, ఏ అధికారిని కలిసినా పట్టించుకునే నాథుడే లేరు. ప్రతీ సారీ వెళ్లడం.. వినతి పత్రాలు ఇవ్వడం.. వాటిని చూసి వాళ్లు పక్కన పడేయటం జరుగుతోంది. ఇది సరైన పద్దతి కాదని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏమో పథకాలు ఇస్తున్నాం అని చెబుతుంది.. కానీ ఈ పథకాల వలన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఎటువంటి పథకం కూడా మాకు రావడం లేదు". - దూసి భానుజిరావు, ఐకాస నేత
ఇవీ చదవండి: