రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఇవాళ ఉభయసభల ముందుకు రానుంది. శాసనసభలో సీఎం కేసీఆర్, మండలిలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో ఉభయసభల సభా వ్యవహారాల సలహా సంఘాలు ఈ సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేయనున్నాయి.
ఉదయం 11.30 నిమిషాలకు...
ఫిబ్రవరి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్నెళ్ల కాలానికి నిధులు ఖర్చు చేసేందుకు అసెంబ్లీ, మండలి అనుమతి తీసుకుంది. ఈ గడువు నెలాఖరుతో ముగియనుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, మండలి సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉభయసభలు ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నేరుగా బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే కేవలం బడ్జెట్ ప్రతిపాదనకు మాత్రమే నేటి సమావేశాలు పరిమితమవుతాయి. అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి.
పూర్తి స్థాయి ఎజెండా ఖరారు
బడ్జెట్ సమావేశాల పూర్తి స్థాయి ఎజెండా నేడు ఖరారు కానుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలి అన్న విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం శాసనసభ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశమవుతాయి.
కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పురపాలక చట్ట ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు సహా మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పెడతామని గతంలో ప్రకటించినా... దీనికి సంబంధించిన కసరత్తు ఇంకా ప్రారంభం కాని నేపథ్యంలో సర్కారు ఏం చేస్తుందన్నది స్పష్టత రావాల్సి ఉంది.
మండలి అధ్యక్ష పదవికి నామినేషన్లు
మరోవైపు శాసనమండలి అధ్యక్ష పదవి కోసం ఇవాళ నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. మండలి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నిక ఈ నెల 11న చేపడతారు. ప్రస్తుతం మండలి బలాబలాల దృష్ట్యా తెరాస అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఇదీ చూడండి : బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీ ముస్తాబు