సీతానగరం పుష్కరఘాట్ వద్ద జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు. కేసు విచారణ వేగంగా సాగుతోందని..కీలక ఆధారాలు సేకరించామని చెప్పారు. ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయన్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని శిక్షణలో భాగంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సేవలందిస్తున్నారు. గత నెల 19న రాత్రి ఎనిమిదింటికి విధులు ముగిశాక కాబోయే భర్తతో కలిసి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం పుష్కరఘాట్ వైపు వచ్చారు. నది లోపలికి వెళ్లి ఇసుక తిన్నెలపై కూర్చున్నారు. అప్పటికే అక్కడ మాటేసిన ఇద్దరు దుండగులు వీరి కదలికలు గమనిస్తూ వెనుకవైపు నుంచి ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. బ్లేడ్లు చూపుతూ చంపేస్తామని బెదిరించారు. యువకుడిని పక్కకు ఈడ్చేసి బాధితురాలి చున్నీతో కాళ్లు చేతులు కట్టేశారు. బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. దుండగుల్లో ఒకడు బ్లేడును యువకుడి మెడపై ఉంచి బెదిరించాడు. మరో వ్యక్తి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత రెండో దుండగుడు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బాధితులు కేకలు వేసినప్పటికీ ఈ ప్రాంతం రోడ్డుకు దూరంగా ఉండడంతోపాటు చీకటి కావడంవల్ల ఎవరికీ వినిపించలేదు. యువ జంట వద్దనున్న సెల్‌ఫోన్లు, డబ్బు, బాధితురాలి చెవిదిద్దులు దోచుకొని నిందితులు పారిపోయారు.
22 రోజులు కావస్తున్నా...
ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఘటన జరగటం దారుణమని పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. అత్యాచార ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం..విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. త్వరగా నిందితులను పట్టుకోవాలని సూచించింది. అత్యాచార ఘటన జరిగి 22 రోజులు కావస్తున్నా..నిందితులను అరెస్టు చేయకపోవడంతో పోలీసుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తున్నాయి. దీంతో తాజాగా ఈ కేసుకు సంబంధించి గుంటూరు అర్బన్ ఎస్పీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Gang Rape: కాబోయే భర్తను కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!