ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారి తన కర్తవ్యాన్ని మరిచి ఓ మహిళ వద్ద డబ్బు వసూలు చేయడంతో పాటు, లైంగిక దాడికి యత్నించాడని ఆరోపణలు రావడం అమరావతిలో కలకలం రేపింది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐని సస్పెండ్ చేశారు.
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు సోమవారం అమరావతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు. విషయం తెలుసుకున్న అమరావతి ఎస్సై రామాంజనేయులు తన వ్యక్తిగత వాహనంలో డ్రైవర్ సాయికృష్ణతో కలిసి అక్కడికి చేరుకున్నారు. వ్యభిచారం కేసు నమోదు చేస్తానని ఆ జంటను బెదిరించి వారి వద్ద నుంచి రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా, వారు రూ.5 వేలు ఇస్తామని చెప్పారు. తమ వద్ద ఉన్న రూ.3 వేలు ఇచ్చి మరో రూ.2 వేల కోసం బాధితుడు ఏటీఎంకు వెళ్లాడు. అతనితో పాటు వెళ్లి రూ.2వేలు తీసుకోవాలని డ్రైవర్ సాయికృష్ణను పంపించాడు. ఆ తరువాత ఒంటరిగా ఉన్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వ్యక్తి ఏటీఎం నుంచి తిరిగి వచ్చేంత వరకూ ఎస్సై మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరికైనా విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ జంటను హెచ్చరించాడు. వారి వివరాలు తీసుకున్న తరువాత విడిచిపెట్టాడు. బాధితులు మంగళవారం ఎస్సైపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేయగా.. గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావుకు ఆయన విషయాన్ని తెలిపారు.
డీఎస్పీ విచారణ అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్‌ఐ రామాంజనేయులు, డ్రైవర్ సాయికృష్ణను సస్పెండ్ చేశారు. ఎస్‌ఐతో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.
ఇదీ చదవండి: 'చికిత్స అందకుంటే మరణమే.. కనీసం పింఛను ఇప్పించండి'