JAMUNA FRIEND : అలనాటి సినీ తార జమునకు గుంటూరు జిల్లా దుగ్గిరాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. జన్మించడం కర్ణాటకలోని హంపిలో అయినా.. విద్యాభ్యాసం నుంచి సినీ పరిశ్రమలో ఏంట్రీ వరకు దుగ్గిరాలలోనే జరిగింది. సీనియర్ నటి జమునతో తనకు సుమారు 70 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని ఆమె స్నేహితురాలు జంపాల కుసుమ అన్నారు. జమున కష్ట సుఖాలను తనతో పంచుకునే వారని కుసుమ తెలిపారు. 70 ఏళ్లకు పైగా తనతో కలిసి ఉన్న ప్రాణ స్నేహితురాలు దివికేగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఆరోజు నుంచి ఈరోజు వరకూ కూడా మా మధ్య ఉన్న స్నేహం, అనుబంధం, ప్రేమ అనేది కొంచెం కూడా తగ్గలేదు. తనకి కళలు, సినిమా మీద ఎక్కువ అభిమానం ఉండేది. స్కూల్లో పెట్టే ఆటల పోటీల్లో కూడా పాల్గొనేది"- జంపాల కుసుమ, జమున స్నేహితురాలు
హంపి టూ దుగ్గిరాల: జమున 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జన్మించారు. ఈమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. జమున అసలు పేరు జనాభాయి. అయితే జోతిష్యుల సూచన మేరకు జమునగా మార్చారు. ఆమె తల్లి దగ్గరే శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలో శిక్షణ తీసుకున్నారు. అయితే సినీనటుడు జగ్గయ్యది అదే గ్రామం కావడం వల్ల జమున కుటుంబానికి కొంత పరిచయం ఉండేది.
వెండితెర సత్యభామగా గుర్తింపు: ఆ సమయంలోనే నాటకాలకు ఆకర్షితురాలైన జమున చూసి తన నాటకాలలో అవకాశం ఇచ్చారు జగ్గయ్య. అలా ఆమె తొలిసారి ఖిల్జీరాజుపతనం చేశారు. ఆ తర్వాత జమున నటించిన 'మా భూమి' నాటకం చూసి డాక్టర్ గరికిపాటి రాజారావు ఆమెకు మొదటి సినీ అవకాశాన్నిచ్చారు. అలా జమున మొదటిసారి 1952లో విడుదలైన 'పుట్టిల్లు' సినిమా కోసం పనిచేశారు. సత్యభామ పాత్రతో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున. తర్వాత అంచలంచెలుగా ఎదిగి దాదాపు 198 సినిమాల్లో నటించారు.
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం: 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యారు. ఇక జమున వ్యక్తిగత విషయానికొస్తే.. 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారాయ. ఈ జంటకు ఇద్దరు సంతానం. కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి.
ఇవీ చదవండి: