గుంటూరు జిల్లాలో ఎస్ఈసీ నీలం సాహ్ని(SEC Neelam Sahni) పర్యటించారు. నగరంలో ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC) ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరగాలని.. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఒంగోలులో ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన
ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్భందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(SEC) నీలం సాహ్ని ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ఈసీ.. నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారులతో స్థానిక వెలుగు టీ.టీ.డీ.సీ. సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. నిబంధనల ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్లు విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వారికి ముందస్తు శిక్షణలు చాలా కీలకమన్నారు. బ్యాలెట్ బాక్సులు
తరలింపు, బాక్సులు తెరిచే సమయంలో నిశిత పరిశీలన ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాలన్నింటిపై నియమితులైన నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
నిరంతర పర్యవేక్షణ ఉండాలి
కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, సీసీ కెమేరాల నిఘాలో.. ఓట్ల లెక్కింపు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపుపై జిల్లా కలెక్టర్ రూపొందించిన ప్రణాళికను నీలం సాహ్ని ప్రత్యేకంగా అభినందించారు. అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ నిబంధలు పాటిస్తూ.. టీకా రెండు డోసులు వేయించుకున్న వారినే విధుల్లోకి అనుమతించాలన్నారు. బ్యాలెట్ పత్రాల లెక్కింపులో
ఏదైనా ఆటంకాలు, అవాంతరాలు ఎదురైతే ఆర్.ఓ.లు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నామని.. ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఒక జిల్లా అధికారి చొప్పున.. 12 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పక్కాగా అమలయ్యేలా.. 15 మంది జిల్లా అధికారులు నిశిత పరిశీలన చేస్తున్నారని ఆయన తెలిపారు. కాంటింగ్ ఏజెంట్ల ఎంపిక ప్రక్రియ శనివారం పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు.
లెక్కింపు సజావుగా సాగడానికి 144 సెక్షన్ అమలు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగడానికి 144 సెక్షన్ అమలు చేస్తున్నామని.. లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
ఇదీ చదవండి:
COUNTING : ఓట్ల లెక్కింపునకు ముమ్మర ఏర్పాట్లు.. పోలీసుల పటిష్ఠ బందోబస్తు