Protests Across the State Condemning Chandrababu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ గుంటూరులోని అమరావతి రోడ్డులో ధర్మాగ్రహ దీక్ష చేట్టారు. దీక్షలో తెలుగుదేశం నేతలు నక్కా ఆనంద్ బాబు, కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది ప్రాణాలు విడిచిన అభిమానులకు నివాళులర్పించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో పోలీసు ఆంక్షలు దాటుకుని నేతలు ర్యాలీ నిర్వహించగా... మన్నవ సుబ్బారావు సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ధూళిపాళ్ల నరేంద్రను పెదకాకాని రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళాలు పాల్గొని బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల అబ్బరాజు చెరువులో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు జలదీక్ష చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం నేత బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో తెలుగు మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఆపాలని ధ్వజమెత్తారు. తాడేపల్లిగూడెం దీక్షా శిబిరం వద్ద నిర్వహించిన ఆందోళకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆ పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చి గృహ నిర్భంధం చేసినా పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులను దాటుకుని తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఎస్వీ రంగారావు విగ్రహం వరకూ 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర విజయవంతంగా నిర్వహించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు..
TDP activists stage protests in AP: చంద్రబాబు అరెస్టుపై కొనసాగుతున్న నిరసన జ్వాలలు...
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విశాఖ జిల్లా భీమునిపట్నం తెలుగుదేశం కార్యాలయం వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం లింగంపేటలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. మునగపాక మండలం నాగులపల్లిలో గొడుగులతో ర్యాలీ చేట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ నేత కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ర్యాలీలో సైకో పోవాలి- సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. నరసన్నపేట దీక్షలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శనచేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా నగరిలో ఐటీడీపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. దీక్షలో ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొని.. చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమలలో అరగుండు గీయించుకుని నిరసన తెలిపారు. రాయదుర్గం శాంతినగర్‌లో మోకాళ్లపై బైఠాయించి ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బెలుగుప్పలో రహదారిపై ముళ్ల కంపలు వేసి అందులో నిలబడ్డారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకూ ఉద్యమాలు ఆపేదిలేదని తేల్చిచెప్పారు.
చంద్రబాబుకు మద్దతుగా పొరుగురాష్ట్రాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అఖిలపక్షం ఆధ్వర్యాన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఖండించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో నిరసనలను అడ్డుకోవడం తగదన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు చేపట్టారు. నిరసన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, అభిమానులు పాల్గొని.. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.