Power Generation at Ramagundam NTPC : రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మించిన కొత్త విద్యుత్ కేంద్రం మొదటి ప్లాంటులో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి నేడో, రేపో ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ప్రారంభించి ప్లాంట్‌లో 72 గంటల పాటు నిరంతరాయంగా ఉత్పత్తి జరిగితే ఆ తర్వాత వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి తేదీని ప్రకటిస్తారు. కొత్త ఏడాదిలో ఇది వెలుగులీననుంది.
తెలంగాణ కోసం ప్రత్యేకంగా 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మిస్తుందని విభజన చట్టంలో కేంద్రం తెలిపింది. తొలి విడతగా ఒక్కోటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో రెండు ప్లాంట్లను నిర్మించింది. మొదటి ప్లాంటులో వీలైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సన్నాహాల్లో భాగంగా ఆరు నెలల నుంచి మూడు సార్లు బాయిలర్‌ను వెలిగించి పరీక్షించారు. చిమ్నీ ఎత్తు 275 మీటర్లు. కన్వేయర్ బెల్టు అనుసంధానం, నీటి శుద్ధి పనులు పూర్తయ్యాయి. ఇక విద్యుదుత్పత్తిని ప్రయోగాత్మకంగా ప్రారంభించడమే మిగిలింది. రెండు ప్లాంట్ల నిర్మాణానికి రూ.10,598.98 కోట్ల వ్యయమైంది. అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విధానంలో నిర్మిస్తున్నందున వ్యయం పెరిగింది. సింగరేణి గనుల నుంచి ఏటా 68.50 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేస్తారు. గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 2 టీఎంసీల నీరు దీనికి సరఫరా అవుతుంది. 2016 జనవరి 18న రాష్ట్ర డిస్కంలు ఎన్టీపీసీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశాయి.
తక్కువ ధరకు కరెంటు: ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంటు దాదాపు యూనిట్ రూ.5కే లభిస్తుంది. ఈ కరెంటు అందుబాటులోకి వస్తే ఇంధన ఎక్స్ఛేంజిలో అధిక ధరలకు కొనే భారం తగ్గుతుందని డిస్కంలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండు 14 వేల మెగావాట్లను దాటినందున ప్రస్తుతం రోజూ ఎక్స్ఛేంజిలో కరెంటును యూనిట్‌కు రూ.12 వరకూ వెచ్చించి 3 కోట్ల యూనిట్లకు పైగా కొంటున్నాయి.
ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైతే ఆరంభంలో కోటి యూనిట్ల వరకూ కరెంటు రోజూ సరఫరా కానుందని భావిస్తున్నాయి. సాధారణంగా దేశంలో ఎన్టీపీసీ ఎక్కడ విద్యుత్ కేంద్రం నిర్మించినా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలకు కరెంటు సరఫరా చేయడం ఆనవాయితీ. కానీ విభజన చట్టం ప్రకారం ఈ ప్లాంటు తెలంగాణ కోసమే ప్రత్యేకంగా నిర్మించినందున ఇక్కడి కరెంటు మొత్తం రాష్ట్రానికే లభిస్తుందని డిస్కంలు తెలిపాయి.
మరో 3 ప్లాంట్లకు ఎన్టీపీసీ సన్నద్ధత తెలిపినా: ఇప్పుడు నిర్మించిన ప్లాంట్లలో 1,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించిన తరవాత మరో 2,400 మెగావాట్లకు ఇంకా 3 ప్లాంట్లను నిర్మించడానికి ఎన్టీపీసీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సన్నద్ధతను తెలిపింది. నిర్మాణం ప్రారంభించాలంటే ఆ 2,400 మెగావాట్ల కరెంటునూ పూర్తిగా కొంటామని రాష్ట్ర డిస్కంలు ఎన్టీపీసీతో తొలుత విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవాలి.
కానీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా యాదాద్రి పేరుతో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. 2023 డిసెంబరు నాటికల్లా విద్యుదుత్పత్తి ప్రారంభించాలని పనులు చేస్తున్నారు. ‘‘యాదాద్రిలో ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రానికి అదనంగా థర్మల్ విద్యుత్ అవసరం ఇప్పట్లో పెద్దగా ఉండదు. అది వచ్చాక రాష్ట్ర విద్యుత్ డిమాండుపై అధ్యయనం చేసి అప్పుడు ఎన్టీపీసీలో మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్లకు పీపీఏ ఎప్పుడు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది’’ అని సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు.
ఇవీ చదవండి: