పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి.. నల్లబజారులో అమ్మి సొమ్ము చేసుకుంటున్న నిందితులను గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. రూ.లక్షల విలువైన 4 వేల బస్తాల సరకును స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట మండలం రావిపాడు రోడ్డులోని ఓ రైస్‌మిల్లులో భారీగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ఆదివారం నరసరావుపేట గ్రామీణ పోలీసులు గుర్తించారు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం సేకరించి నల్లబజారుకు తరలించేందుకు మిల్లులో నిల్వ చేశారని గ్రామీణ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో ఆయన మిల్లులో తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఐ అచ్చయ్య, ఎస్సై వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి మిల్లు వద్దకు వెళ్లి తనిఖీ చేయగా ఒకవైపు రాశులుగా పోసి, మరోవైపు వేరే గోతాల్లో నిల్వలు ఉండటాన్ని గుర్తించారు. వారు పౌరసరఫరాలశాఖ అధికారులకు సమాచారం అందించారు.
తహసీల్దార్ రమణ నాయక్, బాపట్ల, నరసరావుపేట సీఎస్‌డీటీలు ఓంకార్, కొండారెడ్డి అక్కడికి చేరుకున్నారు. మిల్లులో ఉన్న బియ్యం రాశులను కూలీలతో గోతాలకు నింపించారు. మిల్లు ఆవరణలో మెత్తం 4వేల బస్తాలు ఉన్నట్లు లెక్క తేల్చారు. నరసరావుపేటతోపాటు వినుకొండ, చిలకలూరిపేట, గురజాల నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యం సేకరించినట్లు గుర్తించారు. మిల్లు ఆవరణలో బియ్యం లోడు చేసి ఉన్న లారీని గుర్తించారు. అధికారులు లారీని పోలీసులకు అప్పగించారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలేనికి చెందిన వైకాపా నేత వీరంరెడ్డి పుల్లారెడ్డి, ప్రకాశం జిల్లా సంతమాగులూరుకు చెందిన ఆవుల శివారెడ్డి, గురజాల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లికి చెందిన బత్తుల బాలయ్య దీనికి సూత్రధారులని గుర్తించారు. రేషన్ బియ్యాన్ని సేకరించి నల్లబజారుకు తరలించేందుకు మిల్లులో నిల్వ చేసిన పుల్లారెడ్డి, శివారెడ్డి, బాలయ్యలపై 6-ఎ కేసు నమోదు చేశామని నరసరావుపేట తహసీల్దార్ రమణ నాయక్ తెలిపారు.
ఇదీ చూడండి. అక్షరాస్యతలో ఏపీ వెనుకబాటు.. దేశంలో 22వ స్థానం!