పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజి అమలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఎక్కువమంది ఆదివాసీలు, దళితులే ఉన్నారని, వారికి పునరావాస ప్యాకేజి ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని కన్నా విమర్శించారు. పోలవరం కాఫర్ డ్యాం కారణంగా 137 గ్రామాల్లో వరద సమస్య తలెత్తుతోందని అందుకే ప్యాకేజి త్వరగా అమలు చేయాలని సీఎంకు రాసిన లేఖలో వివరించారు.
ప్రాజెక్టు కారణంగా భూమి కోల్పోయిన ఆదివాసీలకు వేరేచోట సాగు చేసుకోగలిగిన భూములు ఇవ్వాలని.. సమీపంలోనే నివాస సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించిన గృహాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పర్యటక, విద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగాల్లో ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. భూసేకరణలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి, అక్రమాలకు పాల్పడిన వారికి పరిహారం నిలిపివేయాలని లేఖలో సూచించారు.
ఇవీ చదవండి: 'దేవాదాయ శాఖ నుంచి మళ్లించిన నిధులు తిరిగి జమచేయాలి'