Gas Cylinder Price Hike: గ్యాస్ సిలిండర్ ధర నెలనెలా పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గ్యాస్ సబ్సిడీ కింద కొంత డబ్బు ప్రభుత్వం తమ బ్యాంక్ ఖాతాలో జమ చేసేదని.. ప్రస్తుతం గ్యాస్ సబ్సిడీకి కోత విధించిందని ప్రజలు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధర పెంపు విషయంలో పేదల దృష్టితో ఆలోచించడం లేదని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్, ఇతర నిత్యవసరాల ధరలు తగ్గించాలంటున్నారు.
ప్రతి నెల 40 నుంచి 50 రూపాయల వరకు గ్యాస్ ధర పెరుగుతుందని మహిళలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు ఉపాధి కోసం వచ్చి బతుకుతున్న రోజువారీ కూలీలు గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్నారు. సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలామంది ఇళ్లు అద్దె కట్టలేక పోతున్నారు. వీటికి తోడు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగడంతో సామన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో పక్క గ్యాస్ ధర క్రమంగా పెరుగుతుండటంతో తాము బతికేదెలా అని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500కే గ్యాస్ సిలిండర్..: తులసి రెడ్డి
గృహ అవసరాలకి వినియోగించే గ్యాస్ ధర క్రమంగా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని మహిళలు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం గ్యాస్ ధర 750 రూపాయల నుంచి 900 మధ్య ఉండేదని చెప్తున్నారు. అప్పుడు గ్యాస్కి చెల్లించిన దానిలో కొంత డబ్బు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లించేది. అయితే 2019 తర్వాత క్రమంగా గ్యాస్ సబ్సిడీలో కోత విధిస్తూ వస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 1150 రూపాయలకు చేరుకుంది. దీంతో ప్రజలు ప్రభుత్వం చర్యను తప్పుబడుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి కుటుంబాలను పోషించడం కష్టమవుతున్న పరిస్థితుల్లో నెలనెలా గ్యాస్ ధరలు పెరిగితే జీవించేదెలా అని పేద, మధ్యతరగతి మహిళలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో వంట గ్యాస్ కనెక్షన్లు నిత్యం పెరుగుతున్నాయి. అయినా గ్యాస్ సిలిండర్ల ధరలలో పెరుగుదల తప్ప తగ్గుదల కనిపించడం లేదు. చిన్న షాపులు పెట్టుకొని జీవనం సాగించే చిరు వ్యాపారులు సైతం ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తున్నారు. సిలిండర్ల ధరలు పెరుగుతున్నాయి.. గానీ తమ వ్యాపారాలు పెరగడం లేదని చిరు వ్యాపారులు చెబుతున్నారు. చిన్న చిన్న వ్యాపారాల్లో అరకొరగా వచ్చే లాభం కాస్తా ఆ గ్యాస్ సిలిండర్కే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'బండ' బాదుడు.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే?
ఇప్పటికే నిత్యావసర సరుకులు, ఇళ్లు అద్దెలు పెరగడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని సామాన్యులు చెబుతున్నారు. మరో వైపు గ్యాస్ సిలిండర్ రూపంలో అధిక భారం వేస్తే కుటుంబాలను పోషించడం కష్టమవుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్యాస్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. గ్యాస్ సబ్సిడీ అమలు చేయాలంటున్నారు.