రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పక్షాన జనసేన చేసిన విజ్ఞప్తిని గౌరవించి పరీక్షలను రద్దు చేసినందుకు ఏపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. వీటితోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించడం సరైన నిర్ణయమన్నారు.
వైరస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారని... మన రాష్ట్రంలో రోజూ వందలాది కొత్త కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించటం ప్రమాదమని అన్నారు. అన్ని వర్గాల వారితో సంప్రదించి ఇది ప్రమాదకరమని, పరీక్షలు రద్దు చేయమని జనసేన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని తెలిపారు. ఈ విషయంలో సహేతుకంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి, రద్దు కోసం కృషి చేసిన అందరికీ జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలిపారు.