PAWAN IN UNSTOPPABLE 2 : ‘అసలు నేను పెళ్లే చేసుకోవాలనుకోలేదు. బ్రహ్మచారిగా ఉంటూ.. యోగమార్గాన్ని అనుసరించాలనుకున్నా. కానీ ఇన్నిసార్లు పెళ్లి జరిగింది నాకేనా అనిపిస్తుంది. నేనేదీ ప్లాన్ చేయలేదు. నేను ముగ్గుర్ని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు. ముగ్గురితో ఒకేసారి ఉండట్లేదు. నాకు ఒకరితో కుదరలేదు. ఇంకొకరిని చేసుకోవాల్సి వచ్చింది. వారితోనూ కుదరలేదు. మరొకరిని పెళ్లి చేసుకున్నా. విడాకులిచ్చే ఈ పెళ్లిళ్లు చేసుకున్నా. అదీ ఏదో వ్యామోహంతో చేసుకోలేదు.. జరిగాయంతే. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నన్ను విమర్శించటానికి అదో ఆయుధమైపోయింది’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు.
ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న పవన్‌కల్యాణ్ వివిధ అంశాలపై మాట్లాడారు. ‘ఈ మూడు పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అని బాలకృష్ణ ప్రశ్నించగా దానికి ఆయన వివరంగా సమాధానమిచ్చారు. ‘నేను సంప్రదాయాల్ని గౌరవిస్తా. ఇంట్లోవాళ్లు చూశారని తొలిసారి పెళ్లి చేసుకున్నా. ప్రతి రిలేషన్‌షిప్‌లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోయాం. రెండోసారి చేసుకున్నప్పుడు భిన్నాభిప్రాయాల వల్ల విడిపోయాం. మూడు పెళ్లిళ్లంటూ నన్ను విమర్శించే నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి నాకు తెలుసు. కాకపోతే నాలోని సంస్కారం వాటి గురించి మాట్లాడనివ్వదు.
నేను ఎవరినైనా విమర్శించాలంటే వారింట్లో ఆడపడుచులు బాధపడతారని ఆలోచిస్తా. అలాంటి సంస్కారం, విజ్ఞత అవతలి వారికి లేక నాపై మాట్లాడతారు. వాటిని నేను ఆపలేను. ఈ విషయంలో నాకు ఎలాంటి అపరాధభావం (గిల్టీ) లేదు. నేను ఎక్కువ మందికి తెలియడంతో నా జీవితంలో ఏం జరిగినా ఎక్కువ మందికి తెలుస్తుంది’ అని వివరించారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఇకపై మూడు పెళ్లిళ్లు అంటూ ఆయన్ను విమర్శించేవారు ‘ఊరకుక్కలతో సమానం’ అని బాలకృష్ణ అన్నారు. పవన్ చెప్పిన ఇతర విషయాలు ఇలా ఉన్నాయి..
రాజకీయాల్లో నాకు గురువులు ఎవరూ లేరు
రాజకీయాల్లో నాకు గురువులు ఎవరూ లేరు. నాలో నేను లోతుగా చర్చించుకుంటా. రామ్‌మనోహర్ లోహియా, అంబేడ్కర్, ఫులే, తరిమెల నాగిరెడ్డి పుస్తకాలు బాగా చదివాను. ఏదైనా సందేహం తీర్చుకోవాలంటే ఆ పుస్తకాలపైనే ఆధారపడతా. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను స్నేహితుడి కన్నా గురువుగానే భావిస్తా. ‘గురు భాయ్’ అంటా. ఆయనతో సినిమాల కన్నా పుస్తకాలు, పురాణాలు, కవిత్వంపైనే చర్చ ఎక్కువ ఉంటుంది.
రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు
నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. సాటి మనిషికి ఏదైనా చేయాలని స్వచ్ఛందసంస్థ ప్రారంభించాలనే ఆలోచన ఉండేది. చిన్నతనంలో నేను సైలెంట్. ఎవరి జోలికీ వెళ్లేవాడిని కాను. నటనపై ఎప్పుడూ ఆసక్తి లేదు. పదిమంది ఉంటే కారులోంచి బయటకు కూడా వచ్చేవాణ్ని కాదు. రచయిత లేదా డైరెక్టర్ అవ్వాలనుకున్నా. కంప్యూటర్ గ్రాఫిక్సు వైపు వెళ్లాలనీ అనుకున్నా. మా వదిన, అత్తయ్యల ప్రోద్బలంతోనే నటనలోకి వచ్చాను. ఖుషీ తర్వాత నాలుగైదు సినిమాలు చేసి మానేయాలనుకున్నా. నాలుగైదు సినిమాలకు దర్శకత్వం వహించాలనుకున్నా.
ఇదే ఆఖరి సినిమా అని చెప్పేశా
* సుస్వాగతం సినిమా షూటింగ్‌లో బస్సుపై డ్యాన్స్ వేయాలని చెప్పారు. నాకు సిగ్గుగా అనిపించింది. అంతమంది మధ్య ఎలా డ్యాన్సు వేయాలా అని మధనపడ్డా. ఇదే అఖరి సినిమా అని మా వదినకు ఫోన్ చేసి చెప్పేశా. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా నేనేనా.. నాకే జరుగుతోందా? అనిపిస్తుంది.
* బాలకృష్ణ ముక్కుసూటి వ్యక్తి, లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడరు. మంచో చెడో ముఖం మీదే అనేస్తారు. ఆయన ప్రేమ పంచినా, గొడవ పెట్టుకున్నా అలాగే ఉంటుంది.
ఇవీ చదవండి: