OPPOSITION LEADERS FIRES ON CM JAGAN : విశాఖపట్నమే రాష్ట్ర రాజధాని అని వైఎస్సార్సీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజధాని అంశంలో మంత్రులకే స్పష్టత లేదని.. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎవరూ కోరుకోవట్లేదని జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా? అని వైఎస్సార్సీపీ నేతలను మనోహర్ ప్రశ్నించారు.
రాజధాని అంశంలో మంత్రుల్లోనే సఖ్యత లేదని విమర్శించారు. రోడ్డు కూడా వేయలేని సీఎం జగన్.. రాజధానులపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల త్యాగాలను పక్కన పెట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా చేశారని మండిపడ్డారు. ఒక తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత జగన్‌దే అని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంగా గళం విప్పుతుంటే తమ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
అమరావతి రాజధానిపై జగన్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది: రాజధానిపై వైఎస్సార్సీపీ మర్మాన్ని బయటపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అభినందనలు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతి రాజధానిపై జగన్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. విశాఖ రాజధానిని ప్రజలు అంగీకరించరని.. 3 రాజధానులు తెరపైకి తెచ్చారన్నారు. మూడు ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకున్నారని విమర్శించారు. రాజధానిపై రిఫరెండం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అసలేం జరిగిందంటే: మార్చి 3, 4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సు ప్రచారంలో భాగంగా బెంగుళూరులో నిన్న(ఫిబ్రవరి 14న) రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అమర్నాథ్, బుగ్గన పాల్గొన్నారు. అయితే విశాఖనే ఎందుకు రాజధానిగా ఎంచుకున్నారన్న పెట్టుబడిదారుల ప్రశ్నలకు మంత్రి బుగ్గన సమాధానమిచ్చారు. విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలు వనరులు ఉన్నాయని తెలిపారు. మూడు రాజధానుల అంశం గురించి ప్రస్తావించగా కేవలం సమాచారలోపం కారణంగానే రాష్ట్రానికి మూడు రాజధానులు అనే ప్రచారం జరుగుతోందని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం విశాఖనే రాష్ట్ర రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: