గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మరకపూడి వద్ద జూన్ 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వాలంటీర్ మృతిచెందాడు. నరసరావుపేట మండలం లింగంగుంట్లకు చెందిన బురుగోలు వీరప్రతాప్ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. దాంతో పాటు తండ్రితో కలిసి పౌరోహిత్యం చేస్తుంటాడు. గత నెల 29న తండ్రి గురుబ్రహ్మంతో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో మరకపూడి వద్దకు రాగానే వారి బైక్ను మినీ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులకి నరసరావుపేట ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం వీరప్రతాప్ మరణించాడు. గురుబ్రహ్మం పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...