గుంటూరు జిల్లాలో పోలీస్ స్టేషన్కు విచారణ కోసం వచ్చి పురుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపింది. మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన శివరామకృష్ణ తనను వేధిస్తున్నట్లు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం పోలీసులు గత నెల 25వ తేదిన శివరామకృష్ణను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. విచారించే సమయంలోనే శివరామకృష్ణ పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎన్.ఆర్.ఐ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరామకృష్ణ ఇవాళ మరణించాడు.
శివరామకృష్ణ మృతదేహం తీసుకుని కుటుంబసభ్యులు ఇంటికి బయలుదేరారు. వారి వాహనాన్ని మంగళగిరి గ్రామీణ పోలీసులు కాజా టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. పోస్ట్ మార్టం చేయకుండా మృతదేహం తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎన్.ఆర్.ఐ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు తమపై దాడి చేసినట్లు శివరామకృష్ణ కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఇవీ చదవండి: కోటప్పకొండలో ఎస్పీ విశాల్ గున్నీ పర్యటన