NTR centenary celebrations in Guntur: గుంటూరు జిల్లా తెనాలి మండలంలో అంగలకుదురు గ్రామంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా అంగలకుదురు గ్రామంలో 1995 నుంచి టీడీపీ కోసం కష్టపడి పని చేస్తున్న నాయకులకు, మాజీ పంచాయతీ కార్యవర్గ సభ్యులకు, ప్రస్తుత పంచాయతీ కార్యవర్గ సభ్యులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం నుంచి అంగలకుదురు శివాలయం వరకు పాదయాత్రగా నడిచి వెళ్లారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
సభలో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జూలకంటి బ్రహ్మారెడ్డి తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పాదయాత్ర పేరుతో జనంలోకి వచ్చి ఒక్క అవకాశం అంటూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం తన వ్యాపారాలకు అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులు చేత చిత్రహింసలు పెట్టిస్తున్నారని లక్ష్మీనారాయణ అన్నారు.
రాష్ట్రంలో వేలాదిమంది కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎంకు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని లక్ష్మీనారాయణ అన్నారు. మన రాష్ట్రాన్ని నాశనం చేయగలవాడిగా చరిత్రలో సీఎం జగన్ ఒక్కరే నిలిచిపోతారని ఆయన అన్నారు. దీంతోపాటు విశాఖపట్నం రాజధాని చేస్తే ఆ ప్రాంతాన్ని కూడా దోచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారని ఆయన ఆరోపించారు.
"3,500 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించి మోసం చేశారు. రాష్ట్ర సంపద మొత్తాన్ని ఏకీకృతం చేసి సీఎం ఒక్కరే దోచుకుంటున్నారు. తన వ్యాపారాలకు అడ్డుగా వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రాష్ట్రంలో చాలా మంది ఆకలితో చనిపోతున్నారు. రాష్ట్రంలో వేలాదిమంది కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కూడా సీఎంకు కనికరం లేదు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది. మన రాష్ట్రాన్ని సీఎం జగన్ ఒక్కరే నాశనం చేయగలరు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తే ఆ ప్రాంతాన్ని కూడా దోచుకోవాలని అనుకుంటున్నారు." - కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి