గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు సగటున 15 వందల నుంచి 2వేల మంది మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 17 వేల 867 క్రియాశీల కేసులుండగా.. వీరిలో 80 శాతం హోమ్ ఐసోలేషన్‌లోనే ఉన్నారు. మిగిలిన వారు కొవిడ్ కేర్ కేంద్రాలు, ఆస్పత్రుల్లో సేవలు పొందుతున్నారు.
అన్నీ వార్డుల్లో బెడ్లు ఫుల్..
కొద్ది రోజులుగా గుంటూరు జీజీహెచ్‌కు కరోనా రోగుల తాకిడి భారీగా పెరిగింది. ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే లక్షల్లో బిల్లులు వస్తున్నందున.. భారం మోయలేని పేద, మధ్య తరగతి ప్రజలు పెద్దాస్పత్రికి వస్తున్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో 1250 పడకలు నిండిపోయాయి. కొత్త రోగులకు బెడ్‌లు లేవు. క్యాజువాల్టీ, గైనిక్, లేబర్ వార్డులు తప్ప ఆస్పత్రిలోని అన్నివార్డులను కొవిడ్ వార్డులుగా మార్చిన అధికారులు.. కొత్త పడకలు ఇవ్వడానికి ఆక్సిజన్ అవరోధంగా మారిందని చెబుతున్నారు. రోజుకు 24 కిలో లీటర్ల ప్రాణవాయువు అవసరమవుతోందని.. ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని అంటున్నారు.
పడకల కొరతపై డిశ్చార్జ్ కమిటీ..
జీజీహెచ్‌లో పడకల కొరతకు ప్రధాన కారణం డిశ్చార్జ్ రేటు తక్కువగా ఉండడమేనని అధికారులు భావిస్తున్నారు. కొందరు 4 వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. మరికొందరు స్వల్ప లక్షణాలతోనే చేరుతున్నారని.. దీనివల్ల అందరికీ పడకలు ఇవ్వడం సాధ్యం కావడం లేదనేది వారి వాదన. దీనిపై 8 మంది వైద్యులతో డిశ్చార్జ్ కమిటీ వేశారు. వీరు రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి.. డిశ్చార్జ్ పై ఓ నిర్ణయం తీసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా స్వల్ప సమస్యలుంటే అలాంటి వారిని రైల్ మహల్ వద్ద ఏర్పాటు చేసిన స్టెప్ డౌన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తారు. ఫలితంగా... జీజీహెచ్‌పై ఒత్తిడి తగ్గుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు.
ఇదీ చదవండి:
కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్