MP Mopidevi On CBN: రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్పై ప్రతిపక్ష తెదేపా నేతలు బురద చల్లటం సరికాదని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాలకు ముఖ్యమంత్రిపై.. కేసులు పెట్టాలని చంద్రబాబు వ్యాఖ్యానించటం శోచనీయమన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిందని.. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు రక్షణ చర్యలు తీసుకొని నష్ట తీవ్రతను తగ్గించిందన్నారు.
అన్నమయ్య జలాశయంలో సామర్థ్యానికి మించి వరద రావడంతో డ్యాం గేట్లు విరిగాయని మోపిదేవి వెల్లడించారు. ప్రాజెక్ట్ గేట్లకి గ్రీజు రాయకపోవడం వలనే ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పటం బాధాకరమన్నారు.
తెదేపా ప్రతిపక్ష హోదాలో ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టమని మండిపడ్డారు. తమ మనుగడ కాపాడుకునేందుకు తెదేపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం తగదన్నారు. వరదలపై జగన్ తీసుకున్న ముందస్తు చర్యలను కేంద్ర బృందమే అభినందించిందన్న మోపిదేవి.. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి మాది.. మా ముందు తల వంచాల్సిందే : ఉద్యోగనేత సంచలన వ్యాఖ్యలు