కన్నతల్లే తన కుమారుడిని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో శనివారం జరిగింది. కుమారుడు చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని.. మత్తుకు బానిసై వేధింపులకు గురిచేస్తుండటంతో ఆ తల్లి విసుగెత్తింది. దీంతో కుమారుడిని హతమార్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీ అగ్రహానికి చెందిన సుమలత కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్త పదేళ్ల కిందట మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె కూలి పనులు చేసుకుంటూ కుమారుడు, కుమార్తెను పోషిస్తోంది.
సుమలత కుమారుడు పోతురాజు (17) చెడు స్నేహాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతున్నాడు. మద్యంతోపాటు గంజాయి మత్తుకు బానిసయ్యాడు. దీనికితోడు దొంగతనాలు చేస్తుండేవాడు. ఒక కేసులో జైలుశిక్ష అనుభవించి వచ్చాడు. కుమారుడు మారతాడని ఎదురు చూసినా ఫలితం లేదు. మార్పు రాకపోగా కొద్దిరోజులుగా ఆమెను మద్యం తాగడానికి, గంజాయికి డబ్బులు ఇవ్వాలంటూ తిట్టడం, కొట్టడం, చిత్రహింసలు పెడుతున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె శనివారం మద్యం తాగి వచ్చి నిద్రిస్తున్న తన కుమారుడి కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి దిండుతో గొంతు నులిమి హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె వెళ్లి పోలీసులకు జరిగిన విషయం తెలిపిందని తెలిసింది. సమాచారం తెలుసుకున్న వెంటనే నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: వైద్యురాలి ఇంట్లో చోరీ.. కత్తితో బెదిరించి బంగారంతో పరారీ..