నేడు ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖలోని వ్యూహాత్మక చమరు నిల్వల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. డాల్ఫిన్ నోస్ కొండలో భూగర్భ నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. కృష్ణపట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో నిర్మిస్తున్న బీపీసీఎల్ చమురు నిల్వ టెర్మినల్‌కు శంకుస్థాపన చేయనున్నారు .అమలాపురం వద్ద ఓఎన్‌జీసీ వశిష్ట ఎస్1 ఆన్‌షోర్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం గుంటూరులో భాజపా తలపెట్టిన ప్రజా చైతన్య సభకు హాజరుకానున్నారు.
పర్యటన వివరాలు:
⦁ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10గంటల 45 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి రాక
⦁ హెలికాప్టర్ ద్వారా 11.05 గంటలకు బుడంపాడు హెలిప్యాడ్ చేరుకోనున్న ప్రధాని
⦁ 11.15 గంటలకు మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రారంభం
⦁ ఉదయం 11.30 గంటలకు గుంటూరులో భాజపా నిర్వహించే ప్రజాచైతన్య సభకు హాజరు
⦁ మధ్యాహ్నం 12.25 గంటలకు ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం
మోదీ పర్యటన సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతల అదనపు డీజీ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తు కోసం 1700 మంది పోలీసులను నియమించారు.