Mobile Phones Banned Schools In AP: రాష్ట్ర విద్యాశాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పాఠశాలల్లో మొబైల్ పోన్లను వినియోగించకూడదని నిషేధం విధించింది. దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. ఉపాధ్యాయులు పాఠాలను పక్కనపెట్టి ఫోన్లలో గడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురావటాన్ని పూర్తిగా నిషేధిస్తూ మెమో జారీ చేసింది. అటు ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలోకి తీసుకువచ్చిన మొబైల్ ఫోన్లను ప్రధానోపాధ్యాయునికి అప్పగించాలని సూచించింది. పాఠశాల సమయం ముగిసిన తర్వాత తీసుకోవాలని సూచించింది. మధాహ్నం భోజన విరామ సమయంలో.. ఇతర విరామ సమయాల్లో మొబైల్ వినియోగించవచ్చని విద్యాశాఖ తెలిపింది.
విధుల నిర్వహణలో సెల్‌ఫోన్ వినియోగం.. నిషేధం విధించిన అధికారులు
ప్రధానోపాధ్యాయునికి అందించిన తర్వాతే.. ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకావాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేని విద్యను అందించేందుకే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయులు బోధించే సమయంలో విద్యార్థులకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటుందనే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది.
యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. పాఠశాల విద్యా శాఖ రాష్ట్రంలో ఈ చర్యలకు పూనుకుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు విద్యాశాఖ రాష్ట్రంలోని.. ఉపాధ్యాయ సంఘాలు ఇతర వర్గాలతో చర్చించినట్లు విద్యాశాఖ తెలిపింది. చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు.
ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా?.. ఫోన్ను దూరం పెడితే అంతా సెట్!
పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన తాజా నిబంధనలను ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ నిబంధనలు అమల్లోకి రావాలని ప్రకటించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
పాఠశాలల్లో సెల్‌ఫోన్ వినియోగం విద్యావ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తరగతిలో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వినియోగించటం వల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుందని అంటున్నారు. అంతేకాకుండా విద్యార్థుల దృష్టి మళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానాన్ని విద్యార్థులు సైతం అనుసరించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఎక్కువ టైం టీవీ, ఫోన్ చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.. లేకుంటే కష్టమే!