High Level Meeting on Fire Accidents in Hyderabad : హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని భారీ ఎత్తైన భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్ట్‌మెంట్లలోనూ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలన్నారు. ఫైర్ సేఫ్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బీఆర్‌కే భవన్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇంధన, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Fire Accidents in Hyderabad : ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు పలు ప్రతిపాదనలు, సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలో వస్తున్న భారీ అంతస్తుల భవన నిర్మాణాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతలను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు పాశ్చాత్య దేశాలతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులపై అధ్యయనాన్ని వేగంగా చేపట్టి సూచనలు ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఫైర్ సేఫ్టీ శాఖ సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
వారికి రూ.5 లక్షల పరిహారం..: ఫైర్ సేఫ్టీ శాఖకు అవసరమైన ఆధునిక సామగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. శాఖకు అవసరమైన అత్యవసర సామగ్రి విషయానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అగ్ని ప్రమాద నివారణలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భవనాల యజమానులను కూడా భాగస్వాములను చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణలోని సికింద్రాబాద్ దక్కన్‌మాల్ ఘటనలో మరణించిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందివ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఇటీవల సికింద్రాబాద్ దక్కన్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వారి మృతదేహాలు లభించలేదు.