MLA akbaruddin questions Governor speech : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగంపై ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అంశాలు ప్రస్తావించలేదని.. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాలు పేర్కొనలేదా.. లేక గవర్నర్ తొలగించారా అని ప్రశ్నించారు. ప్రొరోగ్ చేయకుండానే సమావేశాల నోటిఫికేషన్ ఇచ్చారని.. అసలు గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందా అని అడిగారు. ఆమోదిస్తే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కేబినెట్ కూడా చర్చించలేదా? అని అన్నారు.
Telangana Budget Sessions 2023-24 : 'గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు మెరుగుపడడం మంచిదే. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలు పేర్కొనలేదు. కేంద్రం నుంచి వచ్చే నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు. కేంద్రం అన్యాయం చేస్తోందని సీఎం బయట చెబుతున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాలు ఎందుకు లేవు?' అని అక్బరుద్దీన్ అన్నారు.
Telangana Budget Sessions 2023 updates : అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి కల్పించుకుని.. అక్బరుద్దీన్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలు చెప్పాల్సిన అవసరం లేదని.. సమయం వచ్చినప్పుడు ప్రజలకు అన్ని అంశాలు చెబుతామని చెప్పారు. అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. "తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ కనబరుస్తోంది. కేంద్రం చేస్తున్న అన్యాయంపై సభలో ఒకరోజు చర్చ జరగాలి. సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అభినందనలు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అంశాలు రావాలి." అని అక్బరుద్దీన్ అన్నారు.
అంతకుముందు.. అసెంబ్లీలో.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించారు. మరో శాసనసభ్యుడు ఆ తీర్మానాన్ని వివేకానందగౌడ్ బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సభలో ప్రసంగించారు. 'తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా మారింది. తెలంగాణ ఆచరిస్తున్న ప్రతి పథకాన్ని... దేశం అనుసరిస్తోంది. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉంది. 8 ఏళ్లలో 18,453 మెగా వాట్లకు విద్యుత్ ఉత్పత్తికి చేరింది. పార్లమెంట్ సాక్షిగా రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా కేంద్రమంత్రి చెప్పారు.' అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
ఇవీ చదవండి :