మందుబాబుల మధ్య చెలరేగిన వివాదం.. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో జరిగిన ఈ ఘటనలో పలువురు యువకులు గాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. నాదెండ్ల మండలం గొరిజవోలు ఎస్సీ కాలనీ యువకులు.. మూడు రోజుల క్రితం చెరువు కట్టపై కాలకృత్యాలు తీర్చుకుంటుంటే.. వారిపైకి ఓ ద్విచక్ర వాహనం దూసుకొచ్చింది. ఈ విషయంపై ద్విచక్ర వాహనంపై వచ్చిన వారితో అక్కడున్న యువకులు గొడవకు దిగారు. ఆ సమయంలో వారు తాగి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై సోమవారం రాత్రి మరోసారి వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటంతో.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ గొడవ సామాజిక విబేధాలుగా మారి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమపై దాడిచేసి కులం పేరుతో దూషించారని సురేంద్ర బాబు, ఎస్సీ కాలనీ యువకులు, గొడవ పెట్టుకొని దాడికి పాల్పడ్డారని వెంకట రెడ్డి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గీయులకు చెందిన 20 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. డీఎస్పీ విజయభాస్కరరావు, సీఐ సుబ్బారావు మంగళవారం గ్రామాన్ని సందర్శించి.. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గీయులతో చర్చించి.. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సహకరించాలని కోరారు. ముందు జాగ్రత చర్యగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి...