man died with shock circuit: గుంటూరు జిల్లా రేపల్లెలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. రేపల్లె 17వ వార్డులో నివసిస్తున్న గూడూరు నరేంద్రకుమార్ (28) బుధవారం 18వ వార్డు శివారులోని జగనన్న కాలనీలో ఓ గృహ నిర్మాణ పని చేసేందుకు వచ్చాడు. గృహానికి ఎలివేషన్ చేసేందుకు అవసరమైన పరంజా కట్టేందుకు సరివి బాదు తీసుకెళ్లేప్పుడు ఇంటి సమీపంలో ఉన్న 33/11కేవీ తీగలు బాదుకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
భర్త మరణ సమాచారం తెలుసుకున్న భార్య నాగదుర్గ రోదనలు మిన్నంటాయి. తమ తండ్రికి ఏమైందో.. అమ్మ ఎందుకు ఏడుస్తోందో తెలియని చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తుండటం చూపరులను కలచి వేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై అబ్ధుల్ రజాక్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. మృతునికి ఐదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. తెదేపా నేతలు అన్నే రామకృష్ణ, మల్లికార్జునరావు, గోపి, జయప్రద, అజయ్‌కుమార్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలు సాయం అందజేశారు.
ఇదీ చదవండి:
COCK FIGHTS IN AP: కత్తిగట్టి కయ్యానికి సై అంటున్న పందెం కోళ్లు.. సిద్ధమైన బరులు