Lakhs of Voters Removed in Andhra Pradesh: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎలాంటి అభివృద్ది పనులు చేయకపోవడం.. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జనం మళ్లీ వలసబాట పట్టడాన్ని కూడా వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. గ్రామాల్లో ప్రజలు లేకపోవడాన్ని అదునుగా చూసుకుని గంపగుత్తగా ఓట్లు తొలగించేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ.. గత పది నెలల్లో ఎన్నికల సంఘం 13.48 లక్షల ఓట్లు తొలగించగా, అందులో 5.78 లక్షల ఓట్లు వలసదారులవే కావడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసాధారణ స్థాయిలో ఓట్ల తొలగింపు: తటస్థులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు భారీ కుట్ర అమలు చేసిన వైసీపీ.. తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం-7 దరఖాస్తులు పెట్టిందని, వాటి ఆధారంగా సమగ్ర విచారణ లేకుండానే ఓట్లు తొలగించేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వీటిపై ఫిర్యాదు చేస్తున్నా ఎన్నికల సంఘం సరిగా స్పందించలేదని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వలసల పేరిట అసాధారణ స్థాయిలో లక్షల ఓట్లు తొలగించటంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Fake Votes in AP: వారం రోజుల్లో ఓటర్ల ముసాయిదా జాబితా.. అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండానే..!
కొత్తగా విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఈ ఏడాది జనవరి 6 నుంచి అక్టోబరు 26 మధ్య 5.78 లక్షల ఓట్లను వలసల పేరిట తీసేశారు. తొలగించిన మొత్తం ఓట్లలో ఇది 43 శాతం. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ- 2023కు సంబంధించి గతేడాది నవంబరు 9న విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం 2022 జనవరి- నవంబరు మధ్య వలసల పేరిట 31 వేల158 ఓట్లు మాత్రమే తొలగించారు.
వ్యక్తమవుతున్న అనుమానాలు: అప్పట్లో మొత్తంగా తొలగించిన 11.23 లక్షల ఓట్లలో ఇవి కేవలం 2.77 శాతమే. కానీ ఇప్పుడు దాదాపు సగం ఓట్లు వలసల పేరిట తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ నాయకులు కుట్రపూరితంగా విపక్షాల ఓట్లు తొలగింపజేయించిన ఉదంతాలు పర్చూరు, కావలి, పిఠాపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే బయటపడ్డాయి. మిగతా నియోజకవర్గాల్లోనూ అలాంటి పరిస్థితే ఉందనేందుకు తాజా గణాంకాలే రుజువని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించాలంటే ఆ వ్యక్తికి లేదా కుటుంబసభ్యులకు అధికారులు ముందస్తు నోటీసు ఇచ్చి విచారించాలి. ఆ తర్వాత అది సహేతుకంగా లేకపోతేనే తొలగించాలి. అయితే వైసీపీ నాయకులు, వాలంటీర్లు, కొంతమంది బీఎల్వోలు కుమ్మక్కై అనేక నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారులైన ఓటర్లకు నోటీసులు ఇవ్వకుండా, వారికి తెలియకుండానే ఓట్లు తొలగించేశారు. ప్రధానంగా విద్య, ఉపాధి కోసం తాత్కాలికంగా వలస వెళ్లి గ్రామాలకు తిరిగొచ్చేవారి ఓట్లు తీసేశారు. గత పది నెలల్లో ఎన్ని ఓట్లు తొలగించారు, ఏ కేటగిరీ కింద ఎన్ని ఓట్లు తీసేశారనే అంశాలతో రాష్ట్రస్థాయి గణాంకాలు విడుదల చేశారు. కానీ జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో వివరాలు ఇవ్వలేదు.
స్పష్టత ఇవ్వని ఎన్నికల సంఘం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024కి సంబంధించి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఓట్ల తొలగింపు కోసం ఎన్ని ఫారం-7 దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆధారంగా చేసుకుని ఎన్ని ఓట్లు తొలగించారనే వివరాలు కూడా ఎన్నికల సంఘం విడుదల చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా ముసాయిదా జాబితాలో కొత్తగా 15.84 లక్షల ఓట్లు చేర్చారు. వాటిలో 6.54 లక్షల ఓట్లు అదర్ ఎన్‌రోల్‌మెంట్ అనే విభాగం కింద చేర్చినవే. ఈ అదర్ ఎన్‌రోల్‌మెంట్ అంటే ఏమిటో ఎన్నికల సంఘం స్పష్టతివ్వట్లేదు.