ఏపీ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన విద్యార్థులపై పోలీసులు అత్యాచారయత్నం కేసుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ముట్టడికి యత్నించిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో రిమాండ్ రిపోర్టులో అత్యాచార యత్నంగా పేర్కొనడంపై మంగళగిరి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థుల సమస్యలపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఐదుగురు విద్యార్థి నేతలు సీఎం నివాసానికి అర కిలోమీటర్ దూరం వరకు వెళ్లగలిగారు. వారిని తెలుగు తల్లి విగ్రహం సమీపంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఐదుగురిపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారిని శనివారం మంగళగిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టు చూసిన న్యాయమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రిపోర్టులో అత్యాచారయత్నం అనే పదం వాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది అత్యాచారయత్నం కేసు ఎలా అవుతుందంటూ నిలదీసినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు.. పాత ఎఫ్‌ఐఆర్ కాపీలను కంప్యూటర్‌లో మార్చే క్రమంలో ఆ పదాలను మార్చకుండా అలాగే వదిలేయడంతో ఈ సమస్య తలెత్తినట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను తిరిగి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్టులో మార్పులు చేసి సంబంధిత సెక్షన్లను పేర్కొంటూ న్యాయమూర్తికి సమర్పించినట్టు సమాచారం.
ఇదీ చదవండి