Nadendla Manohar Reaction on Ippatam Incident: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో నోటీసులు ఇచ్చిన 8 కట్టడాలు తొలగించే చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా ఇప్పటంలో పోలీసు బలగాలను మోహరించడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కూల్చివేతలపై గ్రామస్థులతో ముందుగానే అధికారులు చర్చించారు. అయినా గత అనుభవాల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించడంతో.. మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
జనసేన నేతల నిరాహార దీక్ష: ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ.. ఇప్పటం గ్రామస్థులకు న్యాయం చేయాలంటూ జనసేన నేతలు నిరాహార దీక్షకు దిగారు. గ్రామంలోని రామాలయంలో పూజలు చేసిన అనంతరుం స్థానికులకు మద్దతుగా దీక్షకు దిగారు. అధికారులు వచ్చి ఇళ్లను కూల్చమని హామీ ఇచ్చిన తర్వాతే దీక్షను విరమిణ ఉంటుందని తేల్చి చెప్పారు. జనసేన పార్టీ సభకు స్థలాలు ఇవ్వడమే ఈ గ్రామస్థులు చేసిన పాపమా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికే కూల్చివేసిన ప్రతి ఇంటికీ.. నష్ట పరిహారం ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.
అరెస్టు చేసేందుకు యత్నం: ఇళ్ల కూల్చివేతకు నిరసనగా దీక్ష చేస్తున్న జనసేన నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. జనసేన ముఖ్య నాయకులు శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వర్లు, చిల్లపల్లి శ్రీనివాస్ లు రామాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. గ్రామస్థులకు న్యాయం జరిగేవరకు బయటకు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయినా సరే.. తలుపులను తోసుకుని బలవంతంగా జనసేన నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్దసంఖ్యలో గుడి వద్దకు వచ్చారు. తలుపులు తీసి జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుకు నిరసనగా.. జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. జనసేన నేతలకు మద్దతుగా నిలిచిన స్థానికులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
జనసేనాకు టీడీపీ నేతల సంఘీభావం.. జనసేన నేతల దీక్షలకు తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. సీఎం జగన్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏడాది నుంచి గ్రామస్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాదెండ్ల మనోహర్ స్పందన: ముఖ్యమంత్రి కళ్లలో పైశాచికానందాన్ని చూడటం కోసం వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు పచ్చటి గ్రామాల్లో మంటలు పెడుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ల మండలం పెదఅమిరంలో నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. జనసేన ఆవిర్భావ వేడుకల కోసం ఇప్పటం గ్రామ ప్రజలు భూములిచ్చారన్న కక్షతో.. ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు.
4 వేల జనాభా ఉన్న చిన్న గ్రామంలో 120 అడుగుల వెడల్పున రోడ్లు వేయడం ఏమిటన్న ఆయన.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనూ అంతే వెడల్పుతో రోడ్లు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. రానున్న రోజుల్లో జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని.. వైసీపీ ప్రజాప్రతినిధులకు బుద్ధి చెప్పే రోజు త్వరలో రానుందని మనోహర్ అభిప్రాయపడ్డారు. గ్రామస్థులు కోర్టును ఆశ్రయించకుండా.. పనిగట్టుకుని శనివారం కూల్చడాలు మొదలెట్టారన్న ఆయన.. దమ్ముంటే సోమ, మంగళవారాల్లో కూల్చివేతలు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి ప్రజాసేవ కోసం ఎన్నికయ్యారో.. లేక కక్ష సాధింపుల కోసం ఎన్నికయ్యారో చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్న తరుణంలో.. మచిలీపట్నంలో సభ కోసం భూములిచ్చిన రైతులను భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతో మళ్లీ ఇవాళ కూల్చివేతలు ప్రారంభించారన్నారు. రైతుల తరపున జనసేన అండగా ఉంటుందని.. వారికి మద్దతుగా ఎలాంటి కార్యక్రమానికైనా సిద్ధమని మనోహర్ స్పష్టం చేశారు.
"దమ్ముందా.. దమ్ముందా అని పదేపదే అనే ముఖ్యమంత్రికి.. ఎందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఈ కూల్చివేత కార్యక్రమం చేయలేదని ప్రశ్నిస్తున్నాను. కేవలం శని, ఆది వారాల్లో మాత్రమే ఎందుకు చేస్తున్నారు. ఎందుకు ఈ మూర్ఖమైన నిర్ణయం మీది. కనీసం మీలో పరిపాలన చేసే దక్షత లేదు కాబట్టి.. మీలో జ్ఞానం, పరిజ్ఞానం లేదు కాబట్టి.. 4 వేల జనాబా ఉన్న చిన్న గ్రామంలో ఆల్రెడీ 80 అడుగుల రోడ్డు ఉంటే.. దానిని 120 అడుగులు చేస్తున్నామని చెప్తున్నారు. రాత్రింబవళ్లు.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జనసేన నాయకులు సంఘీభావం తెలపకుండా.. ఎక్కడికక్కడ రోడ్లు మూసివేశారు. పోలీసులను మోహరించారు". - నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్
ఇవీ చదవండి: